తెలుగుదేశం పార్టీ బుధవారం భారీగా సంస్థాగత మార్పులు ప్రకటించింది. ఆ మార్పుల్లో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు రాజేష్ కిలారు. చాలా కాలంగా నారా లోకేష్‌కు దగ్గరగా ఉండే వ్యక్తి, వెనక నుంచి వ్యూహాలు రూపొందించే కీలక వ్యక్తిగా పేరు ఉన్న రాజేష్ కిలారును ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇదే పదవిలో ఇంతవరకు లోకేష్ ఉన్నారు.
పార్టీలో సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ తర్వాత మూడో ముఖ్య వ్యక్తిగా రాజేష్‌ను భావిస్తారు. ఇంతకాలం స్టేట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉన్న ఆయన ఇప్పుడు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు తీసుకోవడం, పార్టీ నిర్ణయాల్లో ఆయన పాత్ర ఎంత పెరిగిందో చూపిస్తోంది.
రాజేష్ ప్రయాణం కూడా చాలా ఆసక్తికరం. 2012లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన చేరారు. కానీ ఆయనకు లోకేష్‌తో అప్పటికే పరిచయం ఉంది. ఇద్దరూ హైదరాబాద్‌లో ఒకే స్కూల్‌లో చదివారు. ఆ పరిచయం తర్వాత రాజకీయంగా కూడా బలమైన భాగస్వామ్యంగా మారింది.
2019 ఎన్నికల్లో పార్టీకి భారీ దెబ్బ తగిలినప్పుడు, కేవలం 23 సీట్లకు పరిమితమైపోయిన సమయంలో కూడా రాజేష్ లోకేష్‌కు అండగా నిలిచారు. ఆ సమయంలోనే ఆయన వ్యూహాలు మరింత స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా లోకేష్ చేసిన 3,000 కిలోమీటర్ల యువ గళం పాదయాత్ర వెనుక రాజేష్ కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతాయి. ఆ యాత్రతో పార్టీ మళ్లీ ప్రజల్లోకి వెళ్లింది, లోకేష్ ఇమేజ్ కూడా బాగా మారింది.
ఇప్పుడు టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, పార్టీ మరియు ప్రభుత్వ విషయాల్లో రాజేష్ ప్రభావం ఎక్కువగానే ఉందని అంటున్నారు. ముఖ్యమైన నిర్ణయాల దగ్గర లోకేష్ ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. కాబట్టి ఈ పదోన్నతి కొత్తది కాదు, ఆయన ఇప్పటివరకు నిశ్శబ్దంగా నిర్వహించిన బాధ్యతలకు అధికారిక గుర్తింపే అని చెప్పొచ్చు.
ఇకపై రాజేష్ కిలారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తో కలిసి పనిచేయనున్నారు. ఈ ముగ్గురూ నలభై ఏళ్ల వయసులో ఉండటం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పార్టీ భవిష్యత్తు యువ నాయకత్వంపైనే ఆధారపడుతుందని టీడీపీ ఈ నిర్ణయంతో స్పష్టం చేసింది.
‘పని చేసే వాళ్లకే పదవులు’ అనే లోకేష్ లైన్ ఇప్పుడు ఈ నియామకాలలో క్లియర్‌గా కనిపిస్తోంది. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో కూడా కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చారు. సీనియర్లకు గౌరవం ఇస్తూనే, యువతకు అవకాశాలు ఇవ్వడం ద్వారా వచ్చే 30-40 ఏళ్ల నాయకత్వాన్ని సిద్ధం చేయాలనే ఆలోచనతో ఈ మార్పులు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి ఈ కొత్త కమిటీలు టీడీపీకి కొత్త స్టైల్, కొత్త కల్చర్, కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.




