నక్కకు, నాగలోకానికి ఎంత తేడా ఉందో… ఈవీవీ ‘జంబలకిడిపంబ’కు, జేబి మురళీకృష్ణ ‘జంబలకిడిపంబ’కు అంతకంటే ఎక్కువ వ్యత్యాసం ఉందని చెప్పవచ్చు. ‘గీతాంజలి’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, ఆ తర్వాత ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో ఒకడుగు వెనక్కి వేయగా, ఈ ‘జంబలకిడి;పంబ’తో ఏకంగా పదడుగులు వెనక్కి వేసేలా దర్శకుడు జేబీ ఈ సినిమాను తీర్చిదిద్దాడనే టాక్ సినీ విమర్శకుల నుండి వ్యక్తమవుతోంది.
ఈ సినిమాకు సంబంధించి ఇటీవల కట్ చేసిన ట్రైలర్ హిలేరియస్ గా ఉండడంతో, సినిమా కూడా అంతే స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు భావించారు. అయితే ట్రైలర్ లో చూపించింది తప్ప సినిమాలో విషయం లేదన్నది రిలీజ్ తర్వాత గానీ, అవగతం కాలేదు. పేరుకు కామెడీ సినిమా అయినా మనస్పూర్తిగా నవ్వుకోవడానికి ఒక్క బలమైన సీన్ కూడా లేకపోవడం, నిజంగా ఈవీవీ సత్యనారాయణ అద్భుత సృష్టి “జంబలకిడిపంబ” అనే టైటిల్ కు ద్రోహం చేసినట్లే భావించవచ్చు.
ఈ సినిమాకు లభించిన టాక్ తో సుధీర్ బాబు “సమ్మోహనం” బాక్సాఫీస్ వద్ద పండగ చేసుకుంటోంది. గత వారం రోజులుగా పోటీ లేకుండా సాగుతోన్న ‘సమ్మోహనం’ ప్రయాణంలో ‘జంబలకిడిపంబ’ బ్రేకులు వేస్తుందేమోనని భావిస్తే, బ్రేకులు మాట పక్కన పెడితే, ‘సమ్మోహనం’ సినిమాకు మరింత ఊపు తెప్పించే విధంగా ప్రేక్షకుల నుండి టాక్ లభించింది. ఫైనల్ గా… “జంబలకిడిపంబ” అన్న టైటిల్ కు అర్ధం ఏమిటో ఈ చిత్ర దర్శకనిర్మాతలకు తెలిసేలా చేయడంలో ప్రేక్షకులు మాత్రం విజయవంతం అవుతున్నారు.



