సెన్సార్ బోర్డు అవసరమా… కాదా?

Jana Nayagan censor controversy involving Vijay and Madras High Court

కోలీవుడ్‌ హీరో విజయ్‌ జన నాయకుడు సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ లభించలేదు. ఈ సినిమాకి వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పు ఇవ్వగా, సెన్సార్ బోర్డు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సవాలు చేసింది. దానిపై ఈ నెల 21న విచారణ చేపడతామని బెంచ్ చెప్పింది.

కానీ బెంచ్ వరకు వెళ్ళిన సెన్సార్ బోర్డు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళుతుందని స్పష్టమవుతోంది. కనుక ‘జన నాయకుడు’కి ఇప్పట్లో విముక్తి లభించనట్లే.

ADVERTISEMENT

ఈ పరిణామాలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో అసలు సెన్సార్ బోర్డు అవసరమే లేదంటూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ముందుగా ఆయనేమన్నారో చూద్దాం.

ఒకప్పటి సమాజం, పరిస్థితులు వేరు. ఇప్పటివి వేరు. అప్పటి అవసరాలకు తగినట్లుగా సెన్సార్ బోర్డు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు దాని అవసరమే లేదు. దాని కాలపరిమితి ఎప్పుడో ముగిసిపోయింది. కానీ అవసరం లేని ఆ వ్యవస్థని బలవంతంగా నడిపిస్తున్నారు.

సెన్సార్ బోర్డు పరిధిలో లేనివి, అది ఏమాత్రం నియంత్రించలేని హింసాత్మక, సెక్స్ వీడియోలు, సినిమాలు సోషల్ మీడియాలో, మొబైల్ ఫోన్లలోకి వస్తున్నాయి. అటువంటప్పుడు సెన్సార్ బోర్డు ఇంకా సినిమాలలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తుండటం, కొన్ని పదాలు మ్యూట్ చేస్తుండటం, మొహాలు బ్లర్ చేస్తుండటం అవసరమా?

అయినా పాలకులను ఎన్నుకునే విజ్ఞత కలిగిన ప్రజలకు ఇంకా ఏది చూడాలో ఏది వినాలో సెన్సార్ బోర్డు చెప్పాల్సిన అవసరం ఉందా? ప్రజలను ఇంకా చిన్న పిల్లలని అనుకొంటూ సెన్సార్ బోర్డు కాపాడాలనుకోవడం చాలా హాస్యస్పదంగా ఉంది.

ప్రేక్షకులే ఏది కావాలో వద్దో అని నిర్ణయించుకునేలా సెన్సార్ బోర్డు వ్యవహరించాలి. కానీ బోర్డులో వ్యక్తుల సొంత అభిప్రాయలు, ఆలోచనలు, అభిరుచులు, వారి సొంత, రాజకీయ అజెండాలు సినిమాలపై బలవంతంగా రుద్దుతుంటే సినీ పరిశ్రమ ఏం చేస్తోంది?

ఇక్కడ సెన్సార్ బోర్డు తీరు గురించి చర్చ ముఖ్యం కాదు. అసలు ఇలాంటి కాలం చెల్లిన పనికిమాలిన వ్యవస్థ ఇంకా ఎందుకు? అని అందరూ ఆలోచించాలి.

ఇదీ.. రాంగోపాల్ వర్మ పోస్టు సారాంశం. ఆయన వాదన సహేతుకంగానే ఉంది. సెన్సార్ బోర్డు పనితీరు నిజాయితీగా, పారదర్శకం ఉండి ఉంటే ఇటువంటి విమర్శలు ఆలోచనలు ఎవరూ చేసి ఉండేవారు కారు.

జన నాయకుడు సినిమాలో ఉన్న అభ్యంతరకరమైన సన్నివేశాలు, డైలాగులు మరే సినిమాలో లేవా? హింస, రక్తపాతం, అశ్లీల నృత్యాలు, బూతు డైలాగులు లేని సినిమాలు ఎన్ని అంటే సమాధానం చెప్పడం కష్టం.

ఓ పక్క వాటన్నిటినీ అనుమతిస్తూ, వర్మ చెప్పినట్లు సొంత అజెండాతో కొన్ని సినిమాలకు ఈ విధంగా కత్తెర్లు వేయడం, విడుదల కాకుండా అడ్డుకుంటున్నాయి. కనుక ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తమిళనాడు రాజకీయాలలో విజయ్‌ ప్రవేశించకపోయి ఉంటే సెన్సార్ బోర్డు ఈ సినిమాని అడ్డుకొని ఉండేదా?అసలు పట్టించుకునేదా?అంటే కాదనే చెప్పాలి.

‘ప్రజలు చిన్న పిల్లలు కారు… కానీ సెన్సార్ బోర్డు వారిని అలా ట్రీట్ చేస్తూ చెడు సినిమాల నుంచి కాపాడాల్సిన బాధ్యత తమదే అనుకుంటోందనే వర్మ అభిప్రాయాన్ని పూర్తిగా కొట్టిపడేయలేము.

కానీ సెన్సార్ బోర్డు ఇన్ని కత్తెర్లు వేస్తుంటేనే హింస, రక్తపాతం, అశ్లీల నృత్యాలు, బూతు డైలాగులతో సినిమాలు వచ్చేస్తున్నాయి. ఒకవేళ సెన్సార్ బోర్డు లేకుంటే? కుటుంబ సమేతంగా సినిమాలు చూసే పరిస్థితి ఉంటుందా?

దేశంలో అన్ని వ్యవస్థలు చెదలు పట్టేసినట్లే సెన్సార్ బోర్డుకి కూడా చెదలు పట్టేస్తే దానిని సరి చేసుకొని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమదే. ఎందుకంటే దానికి అదే బలవుతోంది కనుక.

ADVERTISEMENT
Latest Stories