స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో జనసేనలో పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మున్సిపల్, పరిషత్ ఎన్నికలలో జనసేన ఘనవిజయం సాధించింది. దీంతో జనసేన పార్టీ నేతలు తొలిసారిగా జడ్పీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులు చేపట్టబోతున్నారు.
కె. భవానీ (శ్రీకాకుళం), ఎన్. నీలిమ (పార్వతీపురం మన్యం), ఎం. నాగమణి (అనకాపల్లి), బీ. దివ్య సునీతారాజ్ (కాకినాడ) జడ్పీ చైర్ పర్సన్‌లుగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
పల్నాటి రజని (తూ.గో. జిల్లా), ఏ. రామకృష్ణ (కోనసీమ), కే. పిచ్చమ్మ (బాపట్ల), వీ. లక్ష్మీ తాయారు (ప్రకాశం), డీ. సునేత్ర (శ్రీసత్యసాయి) జడ్పీ వైస్ చైర్ పర్సన్‌లుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ఇలాంటి విజయాలు, పదవులు టీడీపీ, బీజేపీలకు కొత్త కాదు. కానీ జనసేనకు ఇదే తొలిసారి. కనుక జనసైనికులు దీనిని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు.
నిజానికి శాసనసభ ఎన్నికల్లోనే వారి అధినేత పవన్ కళ్యాణ్‌తో సహా పలువురు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా శాసనసభలో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టగా, కొందరు మంత్రి పదవులు చేపట్టారు.
కనుక జనసేన రాజకీయ ప్రస్థానంలో తాజా విజయాలు, ఈ పదవులు రెండో మైలురాయి అని చెప్పవచ్చు. ఈ విజయాలు, పదవులను చూసి సంతోషపడటం తప్పు కాదు. కానీ ఇక మాకు తిరుగులేదని కాలర్ ఎగరేస్తేనే ప్రమాదం.
ముఖ్యంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మూడు పార్టీలు కలిసి సాగటం చాలా అవసరం. రాజకీయాలలో అతికొద్ది మంది మాత్రమే తక్కువ సమయంలో ఉన్నత స్థాయికి చేరగలరు.
కానీ ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌తో సహా పలువురు అతిరధ మహారధులు దశాబ్దాల తరబడి నిరంతరంగా శ్రమించడం ద్వారానే ఈ స్థాయికి చేరుకోగలిగారనే విషయం ప్రతి జనసైనికుడు గుర్తుంచుకోవాలి.
జనసేన రాజకీయంగా బలపడి, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సొంతంగా అధికారంలోకి రావడానికి ఇంకా చాలా కాలం పడుతుందని, అంతవరకు అందరూ ఓపికగా పనిచేయాలని వారి అధినేత పవన్ కళ్యాణ్ అందుకే హితవు పలికారు.
జనసైనికులు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ, ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పేందుకు ఈ విజయాలు, పదవులే నిదర్శనం.
కనుక వచ్చే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకుంటూ, ఇలా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రత్యర్థి పార్టీ ఉచ్చులో చిక్కుకోకుండా జనసైనికులు అప్రమత్తంగా ముందుకు సాగాలి. భవిష్యత్తులో ఇంకా అనేక విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.





