తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్ళడం, ఇతర పార్టీలకు ఎలా ఉన్నా జనసేనను మాత్రం డేంజర్ జోన్ లో పడేసినట్లయ్యింది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్, ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాల్సి ఉండగా, ఒకప్పుడు బాగా స్ట్రాంగ్ గా ఉన్న టిడిపి క్యాడర్ ఎటు వైపుకు వెళ్లిందో కూడా ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి. సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితం అయ్యే బిజెపి గురించి ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు, అలాగే మజ్లిస్ ఏరియాలో వారిని కొట్టేవారులేరు.
[m9ad]
ఇన్ని పార్టీలకు లేని ఇబ్బంది, అసలు జెండా స్థాపించేవారు కూడా లేని జనసేనకు ఎలా వస్తుంది? అంటే అది ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా జనసేనను చావుదెబ్బ తీస్తుందని చెప్పకతప్పదు. ఒక రకంగా అన్ని పార్టీలను మట్టుపెట్టాలని కేసీఆర్ ముందస్తు ఎన్నికలతో చెలగాటం ఆడుతుండగా, అది జనసేనకు ప్రాణసంకటంగా మారే పరిస్థితులు కనపడుతున్నాయి. నిజంగా చెప్పుకోవాలంటే… అసలు జనసేన తెలంగాణాలో పోటీచేసే పరిస్థితే లేదు. నాయకులు లేరు, క్యాడర్ లేదు… కనీసం ఆ పార్టీని పట్టించుకునే స్థితిలో స్థానిక ప్రజలు కూడా లేరు. దీంతో పవన్ ఈ ఎన్నికల బరిలోకి దిగుతారా? లేదా? అనేది ప్రశ్నార్ధకమే!
ఒకవేళ బరిలోకి దిగితే భారీగా భంగపాటుకు గురికావాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఒక్క సీటు కూడా లభించే పరిస్థితి లేదు గనుక, ఈ ప్రభావం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలపై పెద్ద ఎత్తున పడనుంది. ఒకవేళ పోటీ చేయని పక్షంలో… కేసీఆర్ కు తొత్తుగా ఏపీలో ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం చేసుకునే అవకాశాన్ని పవన్ కల్పించినవారవుతారు. ఇప్పటికే అనేక సందర్భాలలో కేసీఆర్ ను పవన్ బహిరంగంగా పొగిడిన సందర్భాలున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉన్నామంటూ ఇప్పటికే ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్, ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు వెళ్తారా? లేక ‘యూ టర్న్’ తీసుకుంటారా? అనేది వేచిచూడాలి.
బహుశా తనకున మేధావి వర్గంతో చర్చలు జరుపుతున్నారో ఏమో గానీ, తెలంగాణాలో ఎన్నికల వేడి రాజుకున్న వేళ పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారు. కంటికి ఆపరేషన్ అయిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలంటూ డాక్టర్లు ఇచ్చిన సూచన మేరకు అప్పటినుండి మీడియా కంట పడలేదు. అయినా రాజకీయాలు కీలక మలుపులు తిరిగే సమయంలో… ఒక వారం, పది రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా వ్యవహరించడం పవన కళ్యాణ్ కు పరిపాటే గనుక, ప్రస్తుతం ఉంటోన్న ‘అజ్ఞాతవాసం’ అటు అభిమానులకు గానీ, ఇటు పొలిటికల్ వర్గాలకు గానీ ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఒకవేళ పోటీచేస్తానని చెప్పినా, ఇప్పటివరకు జనసేనకు ఎన్నికల సంఘం గుర్తు కూడా కేటాయించలేదన్న విషయం తెలిసిందే!



