ముఖ్యమంత్రి పదవికి కంగారెందుకు బ్రో?

Pawan Kalyan

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్రలలో, పార్టీ సమావేశాలలో ముఖ్యమంత్రి పదవి లభిస్తే స్వీకరిస్తానని చెపుతుండటం ఆలోచింపజేస్తుంది. శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కూడా పార్టీ నేతలతో ఇదే మాట చెప్పారు.

ఇదివరకు బీజేపీతో ఉన్నప్పుడూ పవన్‌ ఈ మాట చెప్పగా తమకు అభ్యంతరం లేదని బీజేపీ చెప్పింది. కానీ ఇప్పుడు టిడిపితో ఉన్నారు కనుక దాని చేత కూడా “పవన్‌ కళ్యాణ్‌ మా ముఖ్యమంత్రి అభ్యర్ధి” అని ప్రకచెప్పించేస్తే ఇక ఆయనను ఎవరూ వేలెత్తి చూపరు.

ADVERTISEMENT

ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా పవన్‌ కళ్యాణ్‌ తన పార్టీ ఎన్నికలలో పోటీ చేసి గెలవాలనుకోవడం, తాను ముఖ్యమంత్రి కావాలనుకోవడం సహజమే. కానీ జనసేన ఒంటరిగా పోటీ చేయడం లేదు. టిడిపితో కలిసి పోటీ చేస్తామని చెపుతున్నారు. కనుక ఇటువంటి కోరికలకు మిత్రపక్షం ఆమోదం కూడా అవసరమే. అయినా ఇంతవరకు రెండు పార్టీలు సీట్ల సర్దుబాట్లు కూడా చేసుకోలేదు. ఏ పార్టీకి ఎన్ని సీట్లో నిర్ణయించుకోనేలేదు. నిర్ణయించుకొన్నా ఎన్ని సీట్లు గెలుచుకొంటుందో అప్పుడే తెలీదు. కనుక ముఖ్యమంత్రి పదవి గురించి ఇప్పుడే ఆలోచించడం తొందరపాటే అవుతుంది. పదేళ్ళుగా రాజకీయాలలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు ఇది తెలియదనుకోలేము. కానీ ఆయన పదేపదే ఈ మాట అంటున్నారు. ఇందుకు 5 కారణాలు కనిపిస్తున్నాయి.

1. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయడానికే పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారనే వైసీపి దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి టిడిపి, జనసేనల వ్యూహం అయ్యుండవచ్చు.

2. టిడిపి-జనసేనల పొత్తులలో భాగంగా జనసేన మెజార్టీ సీట్లు ఆశిస్తోందేమో?

3. రాష్ట్రంలో జనసేనకు అండగానిలబడతాయని భావిస్తున్న కొన్ని సామాజిక వర్గాలకు నమ్మకం కలిగించేందుకు అయ్యుండవచ్చు.

4. పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విదాలా సహకరిస్తుందని హామీ లభించి ఉండవచ్చు.

5. చంద్రబాబు నాయుడుకి బెయిల్‌ లభించని పక్షంలో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని పవన్‌ కళ్యాణ్‌ భావిస్తుండవచ్చు.

ఏది ఏమైనప్పటికీ, ముందుగా బీజేపీతో జనసేన బంధం కొనసాగుతుందా లేదా?తేల్చుకోవడం అవసరం. ఆ తర్వాత టిడిపి-జనసేనలు సీట్ల సర్దుబాట్లు చేసుకోవడం అవసరం. ముందు ఈ రెండూ తేల్చుకొంటే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి గురించి తర్వాత తాపీగా ఆలోచించిచవచ్చు.

ADVERTISEMENT
Latest Stories