పద్దతి మార్చుకోలేకపోతున్న పవన్..! ఇలా అయితే కష్టమే..!

Pawan Kalyan Janasena‘టూరిస్ట్’ రాజకీయ నాయకుడంటూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరే విధంగా తన రాజకీయ ప్రస్థానాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు. “ఎప్పుడొచ్చాం అని కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా” అన్నంత స్పీడ్ గా పవన్ అభిమానుల ఆశలు ఉంటాయి. కానీ సినిమా ఎండింగ్ లో వచ్చే పోలీసుల సీన్స్ మాదిరి ఉంటది పవన్ ఆలోచనా శైలి.

రాజకీయాలలో నాయకుడికి ఉండాల్సింది ఆలోచనతో కూడిన ఆవేశం., ఆవేశంతో కూడిన ఆచరణలు. ఆలోచించినంత మాత్రాన భవిష్యత్ మారిపోదు., ఆవేశపడినంత మాత్రాన ఓట్లు రాలవు. ఈ రెండింటిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నాయకుడు తన లక్ష్యాన్ని అందుకుంటాడు అని గత ఎన్నికల ఫలితాల తరువాత కూడా పవన్ తెలుసుకోలేకపోవడం తన రాజకీయ పరిపక్వతకు నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ADVERTISEMENT

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్నో నిర్ణయాలు వివాదాస్పదంగానే ఉంటున్నాయి. జగన్ ఎప్పుడు ఏదొక వివాదంతో ప్రతిపక్ష పార్టీలకు ఒక అవకాశాన్ని ఇస్తూనే వస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టడంలో క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ తన వంతు ప్రయత్నాన్ని చేస్తూనే వస్తుంది. కానీ క్యాడర్ ను నిర్మించుకోవాల్సిన జనసేన నుండి స్పందన లభించడం లేదు.

సినీ హీరోగా యువతలో పవన్ కు ఉన్న చరిష్మా వేరు., ఆ క్రేజ్ వేరు. ఒక్క పిలుపు ఇస్తే చాలు, అశేష అభిమానగణం పవన్ అనుసరిస్తారు. మాస్ పబ్లిక్ పల్స్ మార్చగలిగే సత్తా పవన్ సొంతం. 2019 ఎన్నికల ప్రచారంలో టీడీపీ ప్రభుత్వాన్ని జగన్ విమర్శించింత కాలం వైసీపీ పార్టీకి రాని మైలేజ్, పవన్ విమర్శలతో జగన్ సంపాదించుకున్నారనేది బహిరంగ సత్యమే.

జనసేన పార్టీని స్థాపించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇంకా సంస్థాగతంగా బలపడకపోవడానికి పవన్ వ్యవహారశైలే కారణం అన్న వాదన లేకపోలేదు. అటు సినిమాలు – ఇటు రాజకీయాలంటూ రెండు పడవల మీద కాలు మోపి, రీమేక్ సినిమాల పేరుతో అటు సినీ అభిమానులను నిరాశ పరుస్తున్నారు., అలాగే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇటు పొలిటికల్ కార్యకర్తలను నిస్పృహలోకి నెడుతున్నారు.

హనుమంతుడి మాదిరి తన బలాన్ని గుర్తించక పార్టీ భవిష్యత్ ను బలహీన పరుస్తున్నారనేది కొంతమంది అభిమానులే చెప్తుంటారు. పవన్ చుట్టూ ఉన్న రాజకీయ కోటరీ ఆయనకు భజన బృందాలుగా మారి వాస్తవ పరిస్థితులను తెలియనివ్వడం లేదని., అభిమానులను, పార్టీ కార్యకర్తలను పవన్ వద్దకు చేరనివ్వడం లేదనే విమర్శలు లేకపోలేదు.

సంస్థాగతంగా పార్టీలో జరిగే తప్పొప్పులను – పొరబాట్లను చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లిన నాడే పార్టీ జెండా కోసం శ్రమించిన నాయకులను గుర్తించగలుగుతారు. ఈ పర్యవేక్షణ లోపం వల్లనే పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు పార్టీ జెండాను, ఎజెండాను ప్రజలలో ఉంచుతున్న కొంతమంది మాస్ లీడర్లను పార్టీ కోల్పోవలసి వచ్చింది.

వ్యూహాలు, వ్యూహకర్తలతో పవన్ కు అవసరమే లేదు. ప్రజా ఆమోదం లేకుండా ప్రభుత్వం అనుసరించే విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజల మద్యే ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజాయాత్రలు చేస్తూ, ప్రభుత్వ వైఖరిని నిలదీస్తే చాలు… తానూ ఆకాంక్షిస్తున్న,అభిమానులు కోరుకుంటున్న పదవులు అధిరోహించడం పెద్ద కష్టమేమి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ తనకున్న ఆవేశాన్ని సక్రమ మార్గంలో ఆచరణలో పెడితే చాలు తరువాత ఘట్టం ప్రజలే చూసుకుంటారు.

నాయకుడనేవాడు తానూ ముందుండి తన వెంట నడిచే వారికి మార్గదర్శకంగా ఉండాలి. అంతేకాని ఎప్పుడో ఒకసారి ఆటవిడుపు రాజకీయాలు చేస్తూ ప్రజలను నిందిస్తే వచ్చే మేలిమి ఉండదు. కనీసం రానున్న రెండేళ్ళైనా వేరొక పార్టీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం ఎదురు చూడకుండా, తన అభిమానులు., కార్యకర్తలు ఇచ్చే రూట్ మ్యాప్ ని ఫాలో అవడం అటు రాష్ట్రానికి ఇటు తనకు వ్యక్తిగతంగా మేలు జరుగుతుందనేది సగటు కార్యకర్తల ఆవేదన.

కార్యకర్తల మనోభావాలను అర్ధం చేసుకోకుండా పవన్ ఇదే తరహా “అతిధి” రాజకీయాలు చేస్తే ఈ సారి కూడా పవన్ అభిమానులకు నిరాశ తప్పదని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. “పవన్ నీ ఫాన్స్ వెయిటింగ్ ఇక్కడ” అంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తూనే ఉంటారు. ఒక ప్రాంతీయ పార్టీ ఎల్లవేళలా ప్రతిపక్షంలో ఉండడం అనేది రాజకీయాలలో నిలబడే అంశం కాదని పవన్ తెలుసుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories