ఈ మాట చెప్పడానికి ఇది సమయం కాదయ్యా పవన్!

JanaSena Pawan Kalyan Avanigadda Speech జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నిన్న కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నుంచి 4వ విడత వారాహి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జగన్మోహన్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అందరూ అదే ఊహించారు కూడా. టిడిపితో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రజల మద్యకు వచ్చారు కనుక పొత్తుల గురించి ఆయన ఏం మాట్లాడుతారా?అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

టిడిపితో కలిసి పనిచేస్తామని, తమ కూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తుందని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవి లభిస్తే చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని కానీ దాని కోసం తాను వెంపర్లాడబోనని అన్నారు. పొత్తుల గురించి స్పష్టంగానే చెప్పారు కానీ ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడటమే తొందరపాటు అని చెప్పక తప్పదు.

ADVERTISEMENT

ఎందువల్ల అంటే, టిడిపితో పొత్తు పెట్టుకొంటున్నప్పుడు దాంతో సీట్ల సర్దుబాటు కూడా చేసుకోకుండా, ఆ పార్టీని సంప్రదించకుండా ముఖ్యమంత్రి పదవి చెప్పడం సరికాదు. ఒకవేళ రాష్ట్రంలో కొన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకే పవన్‌ కళ్యాణ్‌ వ్యూహాత్మకంగా ఈ మాట చెపుతున్నారేమో?

అప్పుడు ఇది తమకు కూడా ఆమోదమే అని టిడిపి చేత చెప్పించగలిగితే ఆయన చెపుతున్న ఈ మాటపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు టిడిపి-జనసేన కూటమి గురించి ప్రజలు కూడా ఓ అభిప్రాయానికి రాగలుగుతారు. కానీ టిడిపి చేత చెప్పించగలరా?లేదు.

ఒకవేళ టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు కానీ పవన్‌ కళ్యాణ్‌ ఆ పదవి ఆశించలేరు కదా?అని టిడిపి శ్రేణులకే కాదు… సామాన్య ప్రజలకు కూడా సందేహం కలుగుతుంది కదా?దీనికి పవన్ ఏం సమాధానం చెపుతారు?

తమతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తామని చెపుతూ ముఖ్యమంత్రి పదవి చేపడతానని పవన్‌ కళ్యాణ్‌ చెపుతుంటే టిడిపి శ్రేణులకు కూడా ఆయన తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లే కదా?ఆయన బీజేపీ అధిష్టానం సూచన మేరకే ఈవిదంగా మాట్లాడుతున్నారని టిడిపికి అనుమానం కలిగితే టిడిపి-జనసేనల మద్య పొత్తులు కుదురుతాయా?కుదరొద్దనే వైసీపి కోరుకొంటోందికదా?అంటే ఈ ముఖ్యమంత్రి పదవి గురించి పవన్‌ చెపుతున్న ఒక్క మాటతో రెండు పార్టీలకు రాజకీయంగా ఎంత నష్టం జరుగుతుందో అర్దమవుతోంది.

కనుక పవన్ ఇటువంటి మాటలతో రాష్ట్ర ప్రజలలో అయోమయం సృష్టిస్తే, వైసీపి దానిని తప్పకుండా తనకు అనుకూలంగా మలుచుకొని టిడిపి-జనసేనలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంది.

అయితే పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఆశిస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులను చూసి, రాష్ట్రాన్ని చక్కదిద్దాలనే తపనతోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని గట్టిగా కోరుకొంటుండవచ్చు. అయితే ఈ మాట చెప్పడానికి ఇది తగిన సమయం, సందర్భం కాదని గ్రహిస్తే మంచిది. కనుక ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవడం చాలా అవసరమే.

ADVERTISEMENT
Latest Stories