బిర్యానీ వండటం అందరికీ రాదు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు అందరూ ఆడలేరు. కానీ వాటిని ఆస్వాదించగలరు. వాటి మంచి చెడ్డలు విశ్లేషించి చెప్పగలరు. అదేవిధంగా మన సినిమాలను కూడా నచ్చితే ఆస్వాదిస్తుంటారు లేకుంటే ఎందుకు తిరస్కరిస్తున్నారో నిర్మొహమాటంగా చెపుతుంటారు.
పొగడ్తలను ఎవరైనా ఆస్వాదించగలరు. కానీ విమర్శలను భరించడం చాలా కష్టం. మన సినీ పరిశ్రమలో నిర్మాణాత్మక విమర్శలు, సూచనలు చేసేవారున్నారు. కానీ వాటిని స్వీకరించే వారు ఎందరు? అంటే వేళ్ళపై లెక్క పెట్టవచ్చు.
సినీ నిర్మాతగా మారిన ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ నేటి సినీ దర్శకులకు అటువంటి విలువైన సూచనలు చేశారు. ఆయన ప్రధానంగా మూడు అంశాలు ప్రస్తావించారు. 1. బడ్జెట్, 2. నిడివి 3. సమయం
బడ్జెట్: మన బడ్జెట్ పది రూపాయలని ముందే అనుకున్నప్పుడు అందరూ ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే పదకొండో రూపాయి నుంచి లాభం వస్తుంది. కానీ పది రూపాయలు అనుకొని వంద రూపాయలు దాటిస్తే, అప్పుడు లాభం రావాలంటే ఖర్చులన్నీ పోనూ కనీసం రూ. 150-200 వరకు రాబట్టగలగాలి.
కానీ అది సాధ్యం కాకనే భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలు నష్టపోతున్నాయి. కనుక బడ్జెట్ ఇంత అని అనుకుంటే అంతకే కట్టుబడి సినిమా తీయాలి తప్ప ఏవో కొత్త ఆలోచనలతో పెంచుకుంటూ పోకూడదు.
నిడివి: గంటన్నరకు సరిపోయే కథతో ఓ సినిమాను మొదలు పెట్టి దాదాపు మూడున్నర గంటల సినిమాగా తీయడం, ఆ తర్వాత ఎడిటింగ్‌లో మళ్ళీ సగం కత్తిరించేసి పక్కన పడేయడం నా దృష్టిలో నేరమే.
ఎడిటింగ్‌లో ఒకటీ అరా కత్తిరించి తీసేయడం సర్వ సాదరణమే. కానీ గంట-గంటన్నర రీల్ కత్తిరించేస్తే, దాని షూటింగ్ కోసం అయిన ఖర్చులు, నటీనటులు, సాంకేతిక నిపుణుల శ్రమ, నిర్మాత సొమ్ము అంతా వృధాయే కదా? కనుక ఈవిధంగా చేయడం క్రిమినల్ మెంటాలిటీ అనే నేను భావిస్తాను.
సమయం: ‘నిన్ను కోరి’ సినిమాలో 70 శాతం మేము అమెరికాలో తీశాం. దాని కోసం మొత్తం 35 మంది అమెరికా వెళ్ళాము. అక్కడ అన్నీ ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నాము. ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే 31 రోజులలో షూటింగ్ పూర్తిచేసుకొని తిరిగి వచ్చేశాము. ఇలా ఖచ్చితమైన షెడ్యూల్‌తో గడువులోగా షూటింగ్ పూర్తిచేయడం చాలా అవసరం. లేకుంటే అక్కడి నుంచి ప్రతీ గంటకు, రోజుకు ఖర్చులు, దాంతో బడ్జెట్ పెరిగిపోతూనే ఉంటుందని కోన వెంకట్ చెప్పారు.
సినీ పరిశ్రమ కష్ట సుఖాలు, లాభనష్టాలు తెలిసిన వ్యక్తిగా కోన వెంకట్ పూర్తి అవగాహన, అనుభవంతో ఈ మాటలు చెపుతున్నారు. కనుక ఆయన చెప్పిన ఈ విషయాలను సినిమాలు తీసేవారు, వాటిలో నటించేవారు, పనిచేసే ప్రతీ ఒక్కరు గ్రహించి పాటిస్తే లాభమే తప్ప నష్టం ఉండదు.





