మనోళ్ళు మాటలతో… జపాన్ గోడలతో కోట కట్టింది!

Japan’s massive concrete sea wall built for tsunami protection

మంగళవారం సాయంత్రం లేదా రాత్రి కాకినాడ వద్ద మొంథా తుఫాను తీరం దాటబోతోంది. ఆ సమయంలో గంటకు సుమారు 100-110 కిమీ వేగంగా ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాను ప్రభావం కోనసీమ పరిసర జిల్లాలపై ఎక్కువగా ఉండబోతోంది.

వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో ప్రభుత్వాలు ప్రాణ నష్టం నివారించగలుగుతున్నా, ఆస్తి నష్టం మాత్రం నివారించలేకపోతున్నాయి. ఎందుకంటే ప్రకృతి శక్తి ముందు మానవులు తల వంచాల్సిందే. తప్పదు!

ADVERTISEMENT

ఇంతకంటే భయంకరమైన సునామీ వంటి ప్రకృతి విపత్తుల తీవ్రతను తగ్గించేందుకు జపాన్ దేశం చేపట్టిన చర్యలు చూసినప్పుడు, మన ప్రభుత్వాల వైఫల్యం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.

మన వాళ్ళు మాటలతోనే కోటలు కడుతుంటారు. ఆ మాటలు కూడా కోటలు దాటిపోతుంటాయి. కానీ జపాన్ మాటలతో కాదు…. కాంక్రీట్ గోడతోనే తన దేశాన్ని కోటలా ధృడంగా మార్చేసుకుంది.

మన వాళ్ళు కృష్ణానదికి ఓ 2.6 కిమీ పొడవునా కరకట్ట నిర్మింఛి విజయవాడ నగరాన్ని కాపాడేశామని గొప్పలు చెప్పుకుంటారు.

కానీ జపాన్ ప్రభుత్వం సముద్రం తీరం వెంబడి ఏకంగా 394 కిమీ పొడవునా 48 అడుగుల ఎత్తైన కాంక్రీట్ గోడ నిర్మించింది!

ఒకవేళ సునామీ అలలు ఆ గోడను కూడా దాటి ముందుకు వచ్చినా, వాటి తీవ్రతని కూడా తగ్గించేందుకు తీరం వెంబడి 394 కిమీ పొడవునా ఏకంగా కోటి మొక్కలు నాటించి పెద్ద అడవినే పెంచింది జపాన్ ప్రభుత్వం!

అంత చిన్న దేశం తన ఊళ్ళని, ప్రజలను కాపాడుకునేందుకు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?

దేశంలో తెలంగాణతో చాలా రాష్ట్రాలకు సముద్ర తీరమే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 1,053 కిమీ పొడవైన సముద్ర తీరం ఉంది. కనుక అదే ఏపీకి పెద్ద వరంగా మారింది. కానీ ఇటువంటి సందర్భాలలో అదే శాపంగా కూడా మారుతోంది. విశాఖతో సహా సముద్ర తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నా తాత్కాలిక చర్యలే తప్ప శాశ్విత నివారణ చర్యలు చెప్పటడం లేదు.

సముద్రం, తీరం పర్యాటక ఆకర్షణలుగా, మత్స్య సంపదకు నిలయంగా చెప్పుకోవడమే కానీ ఆ సముద్ర తీర ప్రాంతాలను కాపాడుకోవడానికి చేసిందేమీ కనపడదు.

ఎందుకంటే ప్రభుత్వాలను నడిపే పార్టీల దృష్టి ఎంతసేపూ రాజకీయాలు, ఎన్నికలు, అధికారంపైనే ఉంటుంది. సంక్షేమ పధకాల పేరుతో ప్రజలను మెప్పిస్తే చాలనుకుంటాయే తప్ప ఇలాంటి సమస్యలని పట్టించుకోవు.

తుఫాను సమయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని, తుఫాను బాధితుల చేతిలో తృణమో పణమో పెడితే చాలనే ధోరణి కనిపిస్తుంటుంది. మళ్ళీ వాటి గురించి కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటాయి.

కానీ జపాన్ ప్రభుత్వం చేసిన ఈ గొప్ప పని గురించి అది కాదు… ఆ దేశ ప్రజలు, ప్రపంచ దేశాలు, ఇప్పుడు మనమూ గొప్పగా చెప్పుకుంటున్నాము కదా!

ADVERTISEMENT
Latest Stories