ఎన్నికల ఓటమి తరువాత బిఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు మినహాయిస్తే మిగతా నేతలందరూ స్తబ్దుగా ఉండిపోయారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో హంగామా చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు సైతం రేవంత్ సర్కార్ పై సై అనడానికి సంకోచిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో అధికార కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ కు చేరిన జీవన్ రెడ్డి బిఆర్ఎస్ స్టార్ లీడర్ గా కొత్త అవతారం ఎత్తారు. జగిత్యాల సభా వేదిక మీద పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ కారెక్కిన జీవన్ రెడ్డి ప్రస్తుతానికి బిఆర్ఎస్ కి కాంగ్రెస్ నుంచి కాపాడేలా ఒక కవచంలా మారారు.
మాజీ పార్టీ మీద, ఆ పార్టీ నాయకత్వం మీద నిత్యం విమర్శలు చేస్తూ, “రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి” అంటూ నినాదాలు చేస్తూ గులాబీ పార్టీ శ్రేణులలో జోష్ నింపుతున్నారు. కాంగ్రెస్ చేతిని వీడి కేసీఆర్ గులాబీ కారెక్కిన జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లో తన నిబద్ధతను నిరూపించుకోవడానికైనా రేవంత్ నుంచి కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి అయిన బాబు వరకు వారి పై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు.
ఇక రేపోమాపో కొత్త పార్టీ తో తెలంగాణ రాజకీయంలో సంచలనంగా మారబోతున్న కవిత విషయంలో కూడా జీవన్ రెడ్డి బిఆర్ఎస్ కి ఆయుధంగా మారే అవకాశం లేకపోలేదు. జీవన్ రెడ్డి కి ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా బిఆర్ఎస్ కి లాభం చేకూర్చే అవకాశం కనిపిస్తుంది.
నిన్న మొన్నటి వరకు బిఆర్ఎస్ ముఖ చిత్రంగా కనిపించిన కేటీఆర్, హరీష్ స్థానంలో ఇప్పుడు జీవన్ రెడ్డి దర్శనమిస్తున్నారు. మరి జీవన్ రెడ్డి తో బిఆర్ఎస్ రేవంత్ రాజకీయానికి చెక్ పెట్టగలరా.?




