అమెజాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. గత ఏడాది 14,000 మందిని, ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే ఏకంగా 16,000 మందిని అమెజాన్ తొలగించింది. తాజాగా నేడు రోబోటిక్ డిపార్ట్‌మెంట్‌లో మరో వంద మందిని తొలగించింది.
ఏఐ లేదా ఆర్ధికపరమైన విషయాల వలన తొలగించలేదని, కంపెనీ పాలసీలో భాగంగానే తొలగిస్తున్నామని, మళ్ళీ కొత్తవారిని నియమించుకుంటున్నామని ఆ సంస్థ సిఈవో అండీ జెస్సీ తెలిపారు.
ఇలాంటి ‘హైర్ అండ్ ఫైర్’ విధానం అమెరికా, యూరోప్ దేశాలలో ఎప్పటి నుంచో ఉంది. కనుక ఇది వారికేమీ తప్పుగా అనిపించదు.
కానీ భారత్‌లో మొదటి నుంచి ‘ఉద్యోగ భద్రత’కి చాలా ప్రాధాన్యం ఉంది. అబ్బాయికి ఉద్యోగ భద్రత ఉంటేనే పిల్లనిచ్చేవారు. ఐటి రంగంలో వైట్ కాలర్ ఉద్యోగాలు, భారీ జీతాలు, విలాసవంతమైన జీవితాలతో భారతీయుల ఈ ఆలోచనా ధోరణిలో క్రమంగా మార్పు వచ్చింది. కానీ నేటికీ ఉద్యోగ భద్రత ఉంటుందా లేదా?అని చూస్తూనే ఉన్నారు.
ఈ ‘హైర్ అండ్ ఫైర్’ విదేశీ విధానంతోనే ఉలిక్కి పడుతున్న భారతీయులు, ఇప్పుడు ‘ఏఐ’తో ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడుతుండటం చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కొత్త టెక్నాలజీ ప్రవేశించిన ప్రతీసారీ ఇలాంటి అవాంచనీయ మార్పులు సహజమే. ఈ సర్దుబాటు సమయం వీలైనంత తక్కువ కాలంలో ముగిస్తే పర్వాలేదు. కానీ దీర్గకాలం కొనసాగితే మాత్రం భారత్‌లో అశాంతి పెరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా పరిశ్రమలు, ఐటి కంపెనీలు తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తుండటం కాస్త ఊరటనిచ్చేదే.
ఉద్యోగ భద్రత ఇక ఆశించకూడదని స్పష్టమవుతోంది కనుక ఉద్యోగాలు నిలుపుకోవడం లేదా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం కొరకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాల్సిందే.
అది వల్లకాదనుకున్నవారు రకరకాల లోన్లు, ఈఎంఐలు, విలాసాలకు దూరంగా ఉంటూ వీలైనంత ఎక్కువ పొడుపు చేయడం నేర్చుకోవడం మంచిది. ఈ రెండు అలవాట్లే కాపాడగలవు.







