
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావు తప్పకుండా జైలుకి వెళ్తారని సిఎం రేవంత్ రెడ్డి చెప్పి ఇంకా 48 గంటలు కాలేదు. ఇంతలోనే వారిద్దరిపై ఎటువంటి చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
కాళేశ్వరం కమీషన్ ఏర్పాటు, దాని నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు చెప్పింది.
పీసీ ఘోష్ కమీషన్ ఏర్పాటు చట్టబద్దమే కానీ నిందితులకు నోటీసులు ఇవ్వకుండా, వారి వివరణ తీసుకోకుండా వారిపై నివేదిక ఇవ్వడం సరికాదని, ఈ విషయంలో కమీషన్ నిబంధనలకు అతీతంగా వ్యవహరించినట్లు భావిస్తున్నామని హైకోర్టు అభిప్రాయపడింది. కనుక ఆ నివేదిక ఆధారంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని నేడు హైకోర్టు తీర్పు చెప్పింది.
హరీష్ రావు, కేటీఆర్ తదితర బీఆర్ఎస్ నేతలు ఊహించినట్లే, “న్యాయం ధర్మం గెలిచిందని, ఈ తీర్పు సిఎం రేవంత్ రెడ్డికి చెంప దెబ్బ,” అని అభివర్ణించారు.
కాంగ్రెస్ నేతల స్పందన కూడా ఊహించినట్లే ఉంది. “తాత్కాలికమైన ఈ తీర్పుతో సంతోషపడితే అది వాళ్ళిష్టం. కానీ ఏదో రోజు ఇద్దరూ జైలుకి వెళ్ళక తప్పదు. ఈ కేసు నుంచి బయటపడేందుకే మొన్న హరీష్ రావు హడావుడిగా ఢిల్లీ వెళ్ళి బిజేపి పెద్దల కాళ్ళు పట్టుకున్నారు. కేసీఆరే నన్ను పంపారని హరీష్ రావు స్వయంగా చెప్పుకున్నారు కదా?
బిజేపితో కలిస్తే ఈ కేసు నుంచి విముక్తి లభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆశపడుతోంది. కానీ ఏదో రోజు న్యాయస్థానంలో ఇద్దరూ దోషిగా నిలబడక తప్పదు,” అని కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్ తదితర కాంగ్రెస్ నేతలన్నారు.
ఒకవేళ హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వెంటనే సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు హరీష్ రావు ఢిల్లీ వెళ్లి అక్కడి న్యాయవాదులని సిద్ధం చేసి ఉంచుకున్నారు. కానీ తీర్పు అనుకూలంగా రావడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు.
The Telangana High Court has given relief to former Chief Minister K. Chandrashekar Rao and…
The critics have spoken,and they’ve been brutal. Michael is sitting at a poor 27% on…