విమర్శల ప్రశ్నలకు కల్కి జవాబు చెప్పినట్టేనా

Kalki-2898-AD-Glimpse-Prabhas-Amitabh-Bachchan-Kamal-Haasan-Deepika-Padukone-Nag-Ashwinవైజయంతి మూవీస్ లాంటి పెద్ద సంస్థ వందల కోట్ల బడ్జెట్ పెట్టిన ప్యాన్ ఇండియా మూవీ తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియా విమర్శలకు జడిసి మార్పులు చేసి పెట్టాల్సి రావడం అరుదు. ప్రభాస్ లుక్ ని డిజైన్ చేసిన తీరు విమర్శలు కురిపించింది. అందుకే టీజర్ మీద అభిమానులు అతిగా అంచనాలు పెట్టుకోకుండా ఎదురు చూశారు. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ నిరాశపరచలేదు.

ప్రాజెక్ట్ కె అంటే కల్కి అని రివీల్ చేయడంతో పాటు చిన్న వీడియోలో కీలకాంశాలు పొందుపరిచాడు. 875 సంవత్సరాల తర్వాత ప్రపంచం దుష్టశక్తుల ఆధీనంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళను అడ్డుకునేందుకు విష్ణుమూర్తి మరోసారి కల్కి అవతారం ఎత్తాల్సి వస్తుంది. తన అస్త్రాలను బయటికి తీసి దుర్మార్గుల అంతానికి సాంకేతికతను వాడుకుంటాడు. అర్థమైనంత వరకు గ్లిమ్ప్స్ లో ఉంది ఇదే.

ADVERTISEMENT

కేవలం నిమిషంన్నర బట్టి సినిమా ఎలా ఉండబోతోందనేది నిర్ణయించలేం. కానీ అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలన్నట్టు తాను తీసుకున్నది ఆషామాషీ పాయింట్ కాదని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. హాలీవుడ్ లో వచ్చిన ఎన్నో బ్లాక్ బస్టర్ సూపర్ హీరోస్ కథల్లో ఎమోషన్స్ పెద్దగా ఉండవు. విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద పీఠ తీసుకుని స్టోరీ కన్నా ఎక్కువ గ్రాఫిక్స్ డామినేట్ చేస్తాయి.

భారతీయ ప్రేక్షకులకు ఎమోషన్లు కూడా పండాలి. జగదేకవీరుడు అతిలోకసుందరి, ఆదిత్య 369, అమ్మోరులు ఎంత ఫాంటసీ అయినా వాటిలో భావోద్వేగాలు తగిన మోతాదులో ఉంటాయి. నాగ్ అశ్విన్ మీద ఈ విషయంలో డౌట్ అక్కర్లేదు. ఈ జనరేషన్ కు పరిచయమే లేని సావిత్రి విషాద కథని అంత అద్భుతంగా తెరకెక్కించినపుడే తన ప్రతిభ బయట పడింది. అది కూడా ఎన్నో పరిమితుల మధ్య.

కల్కిలో ఆ ఇబ్బంది లేదు. బోలెడంత క్రియేటివ్ లిబర్టీ తీసుకోవచ్చు. శంకర్ తీసిన రోబోలో సిజితో పాటు ఎమోషన్స్ పండటం వల్లే దాని స్థాయి పెరిగింది. అశ్విన్ అంతకు మించే ప్లాన్ చేసి ఉండాలి. అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ లాంటి ఆర్టిస్టులను తీసుకోవడానికి కారణం ఇదే. సలార్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో ఇంకో రెండు నెలల్లో తేలిపోతుంది కానీ కల్కి లక్ష్యం అంతకన్నా చాలా పెద్దది.

ADVERTISEMENT
Latest Stories