పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ పాలనలో ఎంపీగా ఎమ్మెల్సీ గా ఉన్న కవిత నేడు అదే పార్టీ మీద రాజకీయ విమర్శలు చేస్తూ, ఆ పార్టీ నాయకుల మీద అవినీతి ఆరోపణలు వినిపిస్తూ సామజిక తెలంగాణ నా బాధ్యత, బీసీ రిజర్వేషన్ మీ హక్కు అంటూ సుద్దపూస ప్రకటనలు చేస్తే వాటిని ప్రజలు విశ్వసిస్తారా.?
అటువంటి కవిత విమర్శలకు తెలంగాణ సమాజంలో విలువుంటుందా.? ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా కవిత జాగృతి పేరు మీద బిఆర్ఎస్ తో చేస్తున్న ఒంటరి రాజకీయ యుద్ధంలో కవిత కేసీఆర్ తో తడపడగలరా.? హరీష్ ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టగలరా.? కేటీఆర్ పై రాజకీయంగా పై చేయి సాధించగలరా.?
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టయ్యి దాదాపు ఆరు నెలలు తీహార్ జైల్లో ఉండి కడిగిన ముత్యంలా బయటకొస్తాను అన్న కవిత కేవలం బెయిలు మీద మాత్రమే బయటకొచ్చారు. ఆ సమయంలో కవితకు అండగా, ఆమె కుటుంబానికి మద్దతుగా ఉన్న కేసీఆర్ కుటుంబం పై, బిఆర్ఎస్ పార్టీ పై కవిత ఎక్కుపెట్టిన రాజకీయ యుద్ధం కవిత నైతికతను సవాల్ చెయ్యదా.?
చేతిలో పదేళ్లు అధికారం ఉంచుకుని నాడు ప్రభుత్వ విధానాల పై నోరెత్తని కవిత, నేడు పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు పడిన తరువాత బిఆర్ఎస్ నాయకుల అవినీతి అంటూ హరీష్ నుంచి మొదలు పెట్టి మల్లారెడ్డి వరకు వారి చిట్టా పొద్దు చదివుతూ గళం విప్పితే అందుకు ప్రజల నుంచి కవిత కు రాజకీయ మద్దతు లభిస్తుందా.?
పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రౌండ్ స్థాయిలో జరిగే అభివృద్ధి తెలుసుకోగలిగిన కేసీఆర్ క్షేత్ర స్థాయిలో తన పార్టీ నేతలు, మంత్రులు చేస్తున్న అవినీతిని తెలుసుకోలేరా.? మరి ఆ అవినీతిలో కేసీఆర్ కి భాగం ఉన్నట్టా.? లేనట్టా.? అనే ప్రశ్నలకు కవిత బదులు చెప్పగలరా.?
అవినీతి జరిగేటప్పుడు, దోపిడీ చేసేడప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుందా.? బిఆర్ఎస్ మాజీ మంత్రుల అవినీతి రేవంత్ సర్కార్ కళ్ళకు కనిపించడం లేదా.? అంటూ ప్రభుతావన్ని ప్రశ్నిస్తూ ఒకసారి,
కేసీఆర్ అమాయకుడు, కాళేశ్వరం అవినీతి లో కేసీఆర్ కి ఎటువంటి పాత్ర లేదు, కేటీఆర్ పై రేవంత్ సర్కార్ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుంది అంటూ మరో మారు కవిత చేస్తున్న రాజకీయానికి విలువ ఉంటుందా.?






