కవితది అయోమయమా? డబుల్ గేమా?

Kalvakuntla Kavitha’s unclear political stand raising questions in Telangana

జగన్‌ విషయంలో షర్మిల వైఖరి ఏవిదంగా ఉంటుందని ఆత్రుతగా ఎదురు చూసిన వారికి ఆమె పూర్తి స్పష్టత ఇచ్చేశారు.

కానీ ఇంచుమించు ఆమె పరిస్థితిలోనే ఉన్న కల్వకుంట్ల కవిత వైఖరి ఏవిధంగా ఉంటుందని ఎదురు చూస్తున్నవారిని ఆమె అయోమయానికి గురి చేస్తున్నారని చెప్పక తప్పదు.

ADVERTISEMENT

ఆమె పార్టీని, తండ్రిని, అన్నని వదులుకున్నా నేటికీ ‘కల్వకుంట్ల’ టైటిల్‌ మాత్రం వదులుకోలేదు! కనుక అందరూ ఆమెను కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలిగానే చూస్తున్నారు. ఇది ఆమె రాజకీయ పురోగతికి స్పీడ్ బ్రేకర్‌ వంటిదే.

ఆమె అవకాశం చిక్కినప్పుడల్లా తండ్రి కేసీఆర్‌ని పొగుడుతూనే ఉంటారు. నేడు దీక్షా దివస్ సందర్భంగా ‘అయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్లనే తెలంగాణ ఏర్పడిందని పొగుడుతో సోషల్ మీడియాలో ఓ సందేశం పెట్టారు. కానీ పదేళ్ళ తండ్రి పాలనలో సామాజిక న్యాయం జరగలేదని, దాని కోసం తాను పోరాడుతున్నానని ముగించారు. అంటే ఆమె తండ్రి వైఖరి, పాలనని విమర్శిస్తున్నట్లే కదా?

ఓ పక్క ఆయనని వెనకేసుకు వస్తూనే ఆయన పదేళ్ళ పాలనలో బీఆర్ఎస్‌ మంత్రుల అవినీతి, అక్రమాల గురించి మాట్లాడుతుంటారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం నభూతో న భవిష్యత్ అన్నట్లు చాలా అభివృద్ధి చెందిందని కవిత కూడా చెప్పేవారు. కానీ ఇప్పుడు అదే నోటితో తెలంగాణలో చాలా గ్రామాలకు సరైన రోడ్లు, కాలువలు, మంచి నీటి సదుపాయం లేదని విమర్శిస్తున్నారు.

ఓ పక్క తండ్రిని పొగుడుతూ, వెనకేసుకు వస్తూనే ఆయన పాలనను విమర్శిస్తూ, , బీఆర్ఎస్‌ నేతల అవినీతి, అక్రమాలను ప్రస్తావిస్తుంటారు. తద్వారా ఆమె రాజకీయ అయోమయంలో ఉన్నారా లేదా పరిస్థితి చక్కబడితే మళ్ళీ తండ్రి పంచన చేరాలనుకుంటున్నారా? అని ప్రజలకు సందేహం కలుగక మానదు.

కనుక షర్మిల మాదిరిగా కల్వకుంట్ల కవిత స్పష్టమైన వైఖరి లేకుండా రెండు పడవల ప్రయాణం చేస్తుంటే, ప్రజల నమ్మకాన్ని ఎన్నటికీ పొందలేరు. పొందలేకపోతే రాజకీయాలలో ఎన్నటికీ రాణించలేరు. ఇంత రాజకీయ అనుభవం, తెలివి తేటలు ఉన్న కల్వకుంట్ల కవితకి ఇంత చిన్న విషయం తెలియదని అనుకోలేము.

కనుక ఏదో గేమ్‌ ప్లాన్ ఉండే ఉంటుంది. ఆ ప్రకారమే ముందుకు సాగుతున్నారేమో? ఆమె చేస్తున్న తీవ్ర విమర్శలు, ఆరోపణలతో బీఆర్ఎస్‌ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావుల ప్రతిష్ట ఎంతగా దెబ్బ తింటున్నప్పటికీ వారు మౌనంగా ఉండిపోతున్నారు. ఇది కూడా అనుమానం కలిగిసొంది.

కల్వకుంట్ల కవితని బయటకు పంపడం, ఆమె పార్టీని విమర్శిస్తుండటం ఇదంతా కేసీఆర్‌ గేమ్‌ ప్లాన్‌లో భాగమేనేమో? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాకపోయి ఉంటే ఆమె వలన బీఆర్ఎస్‌ పార్టీ లేదా పార్టీ వలన ఆమె తప్పకుండా దెబ్బ తింటారు.

కానీ అందరూ కలిసి డబుల్ గేమ్స్ ఆడుతున్నట్లయితే చివరికి అందరూ కట్టకట్టుకొని మునిగిపోవడం ఖాయం. బీజేపి విషయంలో కేసీఆర్‌ ఇలా డబుల్ గేమ్స్ ఆడటం వలననే విశ్వసనీయత కోల్పోయి రాజకీయంగా ఎదురు దెబ్బ తిన్నారు కదా?

ADVERTISEMENT
Latest Stories