కవిత గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారా.?

Kavitha New Party

తెలంగాణ రాజకీయాలలోకి కవిత మరో కొత్త పార్టీ ని రంగ ప్రవేశం చేయించేందుకు సిద్ధమయ్యారు. అయితే అసలు తెలంగాణ రాజకీయాలలో మరో కొత్త పార్టీకి స్థానం ఉందా.? ఉంటే ఆ స్థానం అధికారాన్ని తెచ్చిపెట్టేంత బలమైనదిగా ఉంటుందా.? లేదా కనీసం ప్రత్యర్థులను అధికారానికి దూరం చేసే అంత శక్తివంతమైనదేనా.?

రాజకీయ నాయకుల వెనుక వినపడే చప్పట్లు, ముందు కనపడే జై జై నినాదాలు పార్టీకి ఓటింగ్ ను తెచ్చిపెడతాయా.? గతంలో సినీ ఇండస్ట్రీని దశాబ్దాల పాటు శాసించిన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం అంటూ రాజకీయ ఎంట్రీ ఇస్తే అందుకు ఆయనకు ప్రజల నుంచి చప్పట్లు, అభిమానుల నుంచి విజిల్స్ వచ్చాయి కానీ ఓటర్ల నుంచి ఓట్లు రాలేదు.

ADVERTISEMENT

దీనితో పార్టీ పెట్టిన మూన్నాళ్లకే ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో విలీనం చేసి తిరిగి సినీ ఇండస్ట్రీలోకి వచ్చేసారు చిరు. అలాగే ఆయన తమ్ముడు పవన్ కు సైతం రెండు తెలుగు రాష్ట్రాలలో అనూహ్యమైన అభిమాన బలం ఉంది. ఆయన అడుగు బయట పెడితే చాలు పవన్ కాన్వాయ్ చుట్టూ వేలాదిగా జనాలు, ఆయన సభ పెడితే చాలు సభాప్రాంగణం మొత్తం సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తి పోతుంది.

కానీ అదే పవన్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగితే కనీసం ఎమ్మెల్యే గా కూడా ఓట్లు సాధించలేకపోయారు. ఇక వైఎస్ఆర్ కుమార్తెగా అన్న వదిలిన బాణంలా రాజకీయ తెరమీద మెరిసిన వైస్ షర్మిల సైతం వైసీపీ పార్టీకి ప్రచార కర్తగా పూర్తి విజయం సాధించినప్పటికీ టి వైసీపీ తో బొక్కబోర్లా పడ్డారు.

ఇలా రాజకీయాలలో రాజకీయ నేతల అంచనాలు అసలు వాస్తవాలకు అందనంత దూరంలో ఉంటాయనేది స్పష్టమవుతుంది. అటువంటి పరిస్థితులలో ఇన్నాళ్లు కేసీఆర్ బిడ్డగా బిఆర్ఎస్ చాటున రాజకీయం చేసిన కవిత కొత్త పార్టీతో ఒంటరి రాజకీయంలో స్థిరపడగలరా.?

కవిత కు బిఆర్ఎస్ తో వచ్చిన రాజకీయ అనుభవం కొత్త పార్టీ ఏర్పాటు వరకు సరిపోతుంది. కానీ అదే పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లడానికి, కొత్త నాయకులను సృష్టించడానికి, ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి సరిపోతుందా.? కవిత బిఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన నాటి నుంచి కొత్త పార్టీ అంటూ ప్రకటన చేసినప్పటి వరకు ఒక్కరంటే ఒక్క పాపులర్ ప్రజా రాజకీయ నాయకుడిని కూడాతన వైపు ఆకర్షించుకోలేకపోయారు.

కనీసం ఇన్నాళ్ళుగా తానూ రాజకీయం చేసిన బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చోటామోటా నేతలను సైతం తనవైపు తిప్పుకోలేకపోయారు. అలాగే కేసీఆర్ బిడ్డగా, కేటీఆర్ చెల్లిగా ఉంది కూడా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కవిత ఓటమిని ఎదుర్కొన్నారు.

మరి అటువంటి కవిత ఇప్పుడు తనచుట్టూ ఇన్నాళ్ళుగా ఉన్న కేసీఆర్ అనే కవచం ను బిఆర్ఎస్ అనే బలాన్ని వదులుకుని రాజకీయంగా ముందుకెళ్లగలరా.? గ్రౌండ్ రియాలిటీ ని కవిత పరిగణలోకి తీసుకునే ఇలా కొత్త పార్టీతో బిఆర్ఎస్ పై కథం తొక్కబోతున్నారా.?

ADVERTISEMENT
Latest Stories