నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన “ఇజం” టైటిల్ కు అన్ని వర్గాల నుండి పాజిటివ్ సంకేతాలు వచ్చాయి. ‘టైటిల్’తో పాటు డిజైన్ చేసిన విధానం కూడా అద్భుతంగా ఉండడంతో కళ్యాణ్ రామ్ పంట పండబోతుందంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. అయితే, టైటిల్ డిజైన్ లో ట్విస్ట్ లేదు గానీ, అసలు టైటిలే పెద్ద ‘ట్విస్ట్’గా మారింది.
‘ఇజం’ అంటూ విడుదల చేసిన పోస్టర్స్ లో టైటిల్ గురించి చిన్న చిన్న అక్షరాలతో ‘వర్కింగ్ టైటిల్’ అని పెట్టి విడుదల చేయడం విశేషం. సాధారణంగా షూటింగ్ దశలో ఉనప్పుడు అనుకున్న టైటిల్ ను వర్కింగ్ టైటిల్ గా సినీ వర్గాలు చెప్పుకుంటుంటారు. ప్రస్తుతం ‘ఇజం’ కూడా షూటింగ్ దశలోనే ఉంది. అయితే మునుపెన్నడూ ఇలా ‘వర్కింగ్ టైటిల్’ పేరుతో సినిమా పేర్లను ప్రకటించలేదు.
బహుశా ‘ఇజం’ టైటిల్ పై ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమైతే మార్చుకోవడానికి అనుగుణంగా ‘వర్కింగ్ టైటిల్’ అని పెట్టి విడుదల చేసి ఉంటారని, ఎలాంటి వివాదాలు రాకపోతే తదుపరి విడుదల చేయబోయే పోస్టర్స్ లో ‘వర్కింగ్ టైటిల్’ లోగో తీసివేస్తే సరిపోతుంది అన్నట్లుగా ఉంది. అయితే ఇంత అద్భుతంగా డిజైన్ చేసిన ‘ఇజం’ టైటిల్ తీయాల్సి వస్తే, అది ఏకంగా సినిమా ఫలితం పైనే ఈ ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా ఉంటుందన్న విషయాన్ని కూడా చిత్ర బృందం గమనించాల్సి ఉంది.



