
ఆనాడు తల్లి మాట వినకపోవడం వలన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే ఓ అపూర్వమైన అవకాశాన్ని కాలదన్నుకుంటే, మంచి సమర్ధుడుగా పేరు సంపాదించుకున్న తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ‘రాజకీయ వైఫల్యం’ వలన ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం కోల్పోయారు.
కుటుంబ పాలన విమర్శలకు భయపడి కేసీఆర్ తన కుమార్తె కల్వకుంట్ల కవితకి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. చివరికి ఆమె ఓ సాధారణ ఎమ్మెల్సీగా మిగిలిపోయారు.
కేసీఆర్ అపర చాణక్యుడు… తెలంగాణలో ఆయనను ఢీకొనే మొనగాడు పుట్టలేదనే గుడ్డి నమ్మకం బిఆర్ఎస్ పార్టీలో అందరికీ కలిగించడం వలన పార్టీలో అందరూ ఆయనపైనే గుడ్డి నమ్మకం పెట్టుకుంటే, ఆయన ‘రాజకీయ వైఫల్యం’ కారణంగానే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది.
కనుక కేసీఆర్ నాయకత్వంపై పార్టీ నేతలకు నమ్మకం సడలిందా లేక అధికార పార్టీలో ఉంటే మంచిదనుకున్నారా లేక కాంగ్రెస్, బీజేపీలు నయన్నో, భయాన్నో బిఆర్ఎస్ నేతలను లొంగ దీసుకుంటున్నాయా… అనే ప్రశ్నలకు సమాధానం కేసీఆర్ వద్ద లేదు కానీ బిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీలలో చేరిపోతున్నారు.
ఇందుకు ఉదాహరణగా బీజేపీ ప్రకటించిన 15 మంది ఎంపీ అభ్యర్ధుల జాబితా కళ్ళ ముందే ఉంది. దానిలో ఏడుగురు ఇటీవల బిఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినవారే.
పదేళ్ళుగా కేసీఆర్‌ని అంటిపెట్టుకొని పదవులు అనుభవించిన గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకుకి కేసీఆర్ టికెట్ ఇచ్చేందుకు సిద్దపడినా, ఆయన తన కొడుకుని వెంటబెట్టుకొని సిఎం రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు! తెలంగాణలో మల్కాజ్‌గిరి టికెట్ కోసం అన్ని పార్టీల నేతలు పోటీ పడుతుంటారు. ఈసారి ఆ ఎంపీ సీటుని మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి ఇవ్వబోతే వద్దని చెప్పేశారు.
ఈసారి నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవితని పోటీ చేస్తారనుకుంటే బాజిరెడ్డి గోవర్ధన్‌కి ఆ టికెట్ కేటాయించారు! ఇవన్నీ లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదని సూచిస్తున్నట్లే భావించవచ్చు.
మునుగోడు ఉప ఎన్నికలలో అవసరార్ధం కేసీఆర్ సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. కానీ శాసనసభ ఎన్నికలలో వాటిని కాలితో తన్నేశారు. అదో పెద్ద రాజకీయ పొరపాటని తర్వాత తెలుసుకున్నారు. వాటిని దూరం చేసుకోవడం వలన లోక్‌సభ ఎన్నికలలో వాటి సహాయ సహకారాలు లభించే అవకాశం లేకుండా చేసుకున్నారు.
అందువల్ల శాసనసభ ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన బీఎస్పీతో పొత్తులకు కేసీఆర్ సిద్దపడి, ఆ పార్టీకి ఒకటి రెండు ఎంపీ సీట్లు కేటాయించబోతుండటం చూసి ఈ కేసీఆర్‌కి ఏమైంది? అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
కేసీఆర్ కారణంగానే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన బిఆర్ఎస్ పార్టీ, ఆయన ‘రాజకీయ వైఫల్యాల’ కారణంగా ఇంతగా నష్టపోతుండటం చాలా ఆశ్చర్యకరమే.
కనుక కేసీఆర్, కేటీఆర్ చెప్పుకొంటున్నట్లు గ్యారేజికి వెళ్ళిన కారు మళ్ళీ తిరిగి వస్తుందా లేక లోక్‌సభ ఎన్నికల తర్వాత ‘స్క్రాప్’కు వెళ్ళిపోతుందా? చూడాలి.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…