నిత్యం చంద్రబాబు తో పోటీ పడుతూ, తన రాజకీయ ప్రత్యర్థి బాబే అన్నట్టుగా వ్యవహరించే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమయం, సందర్భం చిక్కినప్పుడల్లా బాబు పై రాజకీయ ద్వేషాన్ని చిమ్ముతూనే ఉంటారు.
అయితే పార్టీ ఓటమి తరువాత ఫామ్ హౌస్ కే పరిమితమైన ఈ పెద్దాయన పార్టీ పూర్తి బాధ్యతలను తనయుడు కేటీఆర్ కు మేనల్లుడు హరీష్ రావు కు కట్టబెట్టి కనీసం పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్నారు.
ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు మీడియాలో దర్శనమిస్తున్న కేసీఆర్ ఏపీలో పొత్తు కారణంగానే బాబు సీఎం అయ్యారని, లేకుంటే జగనే అధికారంలో ఉండి ఉండే వారంటూ వైసీపీకి తన పరోక్ష మద్దతు తెలియచేసారు. అయితే పార్టీ ఓటమితో తెలంగాణలో బిఆర్ఎస్ ను బలోపేతం చేసుకోవడానికి ఆసక్తి చూపని కేసీఆర్ తెలంగాణలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టాడనికి ఏపీ రాజకీయాల మీద విశ్లేషణలు చేస్తున్నారు.
కేసీఆర్ మాదిరి పార్టీ ఓడిపోగానే బాబు ప్రజా క్షేత్రాన్ని విడిచి ఫామ్ హౌస్ జీవితం గడపలేదు. తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని ఆరేళ్ళ రాజకీయ ప్రయాణం కొనసాగించిన పార్టీ నేతలు అవమానించినా ఎన్నడూ వెన్ను చూపలేదు, అలాగే ఓటమిని అవమానంగా భావించను లేదు.
గెలిచిన ప్రత్యర్థి పార్టీ విజయాన్ని అంగీకరించారు, ప్రజా తీర్పుని గౌరవించి అసెంబ్లీ కి వచ్చి తనతో పాటు తన భార్య కు అవమాన భారాన్ని మోసే పరిస్థితిని తెచ్చుకున్నారు. అయినా ఓటమికి తలవంచలేదు, అవమానాలకు కుంగిపోలేదు, ప్రజాక్షేత్రాన్ని విడిచి పారిపోలేదు. వైసీపీ వంటి నియంత పాలనకు ఎదురొగ్గి పోరాడారు, జైలు పాలయ్యారు.
అయినా వెనుకడుగు వెయ్యలేదు, ఆరు పదుల వయసు మళ్ళిన ముసలాడు అంటూ వైసీపీ నేతలు కించపరుస్తున్నా, నలభై ఏళ్ళ అనుభవం నాలుగు సీట్లు లేని పార్టీల పొత్తు కోసం వెంపర్లాడుతుంది అంటూ వైసీపీ శ్రేణులు గేలి చేస్తున్నా పట్టించుకోలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల నాయకులతో కలిసి జగన్ చేస్తున్న తెరచాటు రాజకీయాన్ని ఒంటరిగా ఎదుర్కున్నాడు, పొత్తులో విజయం సాధించాడు.
కానీ కేసీఆర్ పదేళ్ల అధికారానికి దూరమైన పది నిముషాలకే నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఒక సుదీర్ఘ రాజకీయ నాయకుడిగా, దశాబ్దం పాటు ముఖ్యమంత్రి గా చేసిన వ్యక్తి గెలుపోటములను సమ దృష్టితో చూడలేకపోయారు. అలాగే ఇప్పటికి ప్రత్యర్థి పార్టీ గెలుపుని ఒప్పుకోలేకపోతున్నారు.
అసెంబ్లీ కి రాక, ప్రజా సమస్యలను పట్టించుకోక, సొంత పార్టీ నాయకులను కలవక, ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రభుత్వం తో పోరాటాలు చేయక ఫామ్ హౌస్ లో సేద తీరుతున్న కేసీఆర్, బాబు పై విమర్శలు చేయడం, ఆయనతో పోటీ పడడం సమ న్యాయమవుతుందా.?
అధికారంలో ఉంటే బాధ్యతగా, ప్రతిపక్షంలో ఉంటే భరోసాగా నిత్యం ప్రజల మధ్య గడిపే చంద్రబాబు, అధికారంలో ఉంటే ప్రగతి భవన్ లో, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్ లో గడిపే కేసీఆర్ కు పోలికా.? అసలు బాబుతో కేసీఆర్ సరితూగలరా.? రెండు రాష్ట్రాల ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చకొడితే కానీ రాజకీయం చెయ్యలేని కేసీఆర్, రెండు రాష్ట్రాల ప్రజలు అభివృద్ధిని కాంక్షించే బాబుతో సమ ఉజ్జి అవ్వగలరా.?




