ఏపీ, తెలంగాణ సిఎంలు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌లకు ఎక్కడా పొంతన లేనప్పటికీ, కొన్ని విషయాలలో ఇద్దరూ ఇంచుమించు ఒకేలా వ్యవహరిస్తుండటం విశేషం.
జగన్ ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు తప్పు పట్టిన కేసీఆర్, ఎన్నికలు దగ్గరపడగానే టిఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ పధకాలను, కార్యక్రమాలను జగన్ వేరే పేరుతో ఏపీలో అమలుచేస్తుంటారు.
జగన్ పింఛన్ పెంపు విషయంలో అమలుచేస్తున్న విధానాన్ని కేసీఆర్ తాజా మ్యానిఫెస్టోలో ఫాలో అయిపోయారు. ఏపీలో లాగే పింఛన్ ఏటా కొద్దికొద్దిగా పెంచుతామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు.
అయితే కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పధకాలకు రెంటికీ సమాన ప్రాధాన్యం ఇస్తుండగా, జగన్ ఒక్క సంక్షేమ పధకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. కనుక కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పధకాలను చూసి బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తుండగా జగన్ సంక్షేమ పధకాలను మాత్రమే చూసి వైసీపి ఓట్లు వేయాలని కోరుతున్నారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి పోటీని తట్టుకోవడం ఇంకా కొత్త కొత్త సంక్షేమ పధకాలను ప్రకటించాల్సివస్తోంది. కానీ ఏపీలో ఇందుకు పూర్తి భిన్నంగా వైసీపితో పోటీ పడేందుకు టిడిపి, జనసేనలు సంక్షేమ పధకాలను ప్రకటించాల్సివస్తోంది.
కేసీఆర్ కాంగ్రెస్, టిడిపిలలో నేతలను, ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా తన ప్రత్యర్ధ పార్టీలను బలహీనపరిస్తే, జగన్ అటువంటి మొహమాటాలేవీ పెట్టుకోకుండా టిడిపి ముఖ్య నేతలను ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బ తీసేందుకు నేరుగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారాయణ, అచ్చన్నాయుడు తదితరులపై నమోదు చేస్తున్న కేసులే ఇందుకు నిదర్శనం.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో చాలా నిరంకుశంగా వ్యవహరించినప్పటికీ, ఇప్పుడు ప్రతిపక్ష నేతల పట్ల కాస్త మృదువుగానే వ్యవహరిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి రోజు నుంచే టిడిపిని టార్గెట్ చేసుకొని, ఎన్నికల దగ్గర పడేసరికి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించి జైల్లో వేసి రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంత దూరమైన వెళతానని నిరూపించుకొంటున్నారు.
ఈవిదంగా కొన్ని విషయాలలో కేసీఆర్, జగన్ ఒకరి బాటలో మరొకరు సాగుతూ, కొన్ని విషయాలలో ఎవరిదారి వారిదే అన్నట్లు సాగుతున్నారు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేది అందరికీ తెలుసు. తెలియనివారికి ఎన్నికల తర్వాత తప్పకుండా తెలుస్తుంది.



