
జగన్ మళ్ళీ గెలవాలని కేసీఆర్, కేటీఆర్ మనసారా కోరుకుంటున్నారు. ఎందుకు? అంటే అనేక కారణాలు కనబడతాయి. వాటిలో ‘రిటర్న్ గిఫ్ట్ పాలసీ’ కూడా ఒకటి.
కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలందరినీ బిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకొని తమ పార్టీని నిర్వీర్యం చేసినందుకు చంద్రబాబు నాయుడు బాధ పడ్డారు.
కానీ ఆ సమయంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. అమరావతి, పోలవరం నిర్మాణ పనులు, పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టి పనిచేసుకుంటూ పోయారు తప్ప కేసీఆర్ జోలికి పోలేదు.
కానీ చంద్రబాబు నాయుడు ఇలాగే ముందుకు సాగి ఏపీని అభివృద్ధి చేసుకుంటే, తెలంగాణ నష్టపోతుందని భావించిన కేసీఆర్, 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. ఇచ్చారు కూడా.
ఈవిదంగా కేసీఆర్ టిడిపిని, చంద్రబాబు నాయుడుని రెండుసార్లు దెబ్బతీశారు. దాని వలన ఆయన, టిడిపి నష్టపోయిన దానికంటే వందరెట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందని చెప్పక తప్పదు.
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ దుస్థితి గురించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే చులకనగా మాట్లాడటమే ఇందుకు నిదర్శనం.
అయినా జగన్ మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్, కేటీఆర్ కోరుకొంటున్నారు?అంటే ఏపీ నష్టపోయినా తమకు ఉపయోగపడితే చాలనుకుంటున్నట్లే భావించాలి.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడుని దెబ్బ తీశారు. కానీ చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయి, జగన్ ప్రభుత్వం వేధింపులు భరిస్తూ, వైసీపితో పోరాడుతూనే, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.
నేటికీ కేసీఆర్ ఆ రిటర్న్ గిఫ్ట్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే అటు మోడీ, ఇటు రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని సగం ఖాళీ చేసేశారు. ఒకవేళ ఈ ఎన్నికలలో కూడా తేడా కొడితే బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంటుంది.
కనుక కేసీఆర్ చుట్టూ చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఆశా దీపంలా కనిపిస్తున్నారు. జగన్ గెలిస్తేనే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు సాయం చేస్తారని, అదే జగన్ తనకు ఇవ్వగల ‘రిటర్న్ గిఫ్ట్’ అని బహుశః కేసీఆర్ ఊహిస్తుండవచ్చు.
కానీ కేసీఆర్ ఇప్పుడు జగన్‌కు మాట సాయం తప్ప ఇదివరకులా ఏదో చేసే పరిస్థితిలో లేరు. ఒకవేళ ఏదో చేద్దామనుకున్నా రేవంత్ రెడ్డి పక్కలో బల్లెంలా ఉండనే ఉన్నారు.
అయినా ధైర్యం చేసి చంద్రబాబుని దెబ్బ తీయాలని కేసీఆర్ ప్రయత్నిస్తే, అది బీజేపీ భాగస్వామిగా ఉన్న తమ కూటమిని దెబ్బతీయడంగానే మోడీ భావిస్తే, తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత బయటకు రావడం ఇంకా కష్టం కావచ్చు. కనుక ఈసారికి జగన్ మళ్ళీ గెలవాలని కేసీఆర్ మనసారా కోరుకోవడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. అప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ చేత, కొడుకు కేటీఆర్ చేత కూడా జగన్ గెలవాలనే తన మనసులో మాట చెప్పించారు కూడా. చంద్రబాబు నాయుడుకి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కేసీఆర్ మనసులో ఉన్నా ఈసారికి ఇంతే మరి!
Kamiya Jani has been a popular face on social media for her way of interacting…
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…