
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేయడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి.
ఆమె నేరం చేశారా లేదా?అనేది కోర్టులు తేల్చవచ్చు లేదా అక్రమస్తుల కేసులు, వివేకా హత్య కేసులాగే తేల్చలేకపోవచ్చు. కనుక ఇప్పుడు దానిపై చర్చ అనవసరం. కానీ ఆమెను అరెస్ట్ చేయడం, దాని కోసం ఎంచుకున్న సమయం చాలా ముఖ్యం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇంతవరకు చాలా మందినే ఈడీ, సీబీఐలు అరెస్ట్ చేశాయి. కానీ కల్వకుంట్ల కవిత జోలికి పోకపోవడంతో కేసీఆర్-మోడీల మద్య రహస్య అవగాహన ఉన్నందునే అరెస్ట్ చేయడం లేదని ఇంతకాలం కాంగ్రెస్ వాదిస్తోంది.
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ని అధ్యక్ష పదవిలో నుంచి తప్పించేయడంతో కాంగ్రెస్ వాదనలకు మరింత బలం చేకూరిన్నట్లయింది. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ఓటమికి ఇదీ ఒక కారణమే.
ఈసారి లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ కనీసం 10-12 సీట్లు గెలుచుకోవాలని చాలా పట్టుదలగా ఉంది. ఏడుగురు బిఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకొని టికెట్స్ ఇవ్వడమే ఇందుకు చిన్న నిదర్శనం. కనుక బిఆర్ఎస్ పార్టీతో తమకు ఎటువంటి రహస్య అవగాహన లేదని నిరూపించుకునేందుకే బహుశః ఈసమయంలో కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయించి ఉండవచ్చు.
అయితే ఇంతకాలం కల్వకుంట్ల కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఇప్పుడు, “బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీకి సిద్దమయ్యాయి. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్ధులు కూడా లేక ఇబ్బందిపడుతున్న కేసీఆర్‌ని, బిఆర్ఎస్ పార్టీకి తోడ్పడేందుకే ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కవితని కేంద్రం అరెస్ట్ చేయించింది.
తద్వారా బిఆర్ఎస్ పార్టీపై ప్రజలకు సానుభూతి ఏర్పరచగలిగితే లోక్‌సభ ఎన్నికలలో లబ్ధి పొందుతుందని బీజేపీ భావించి ఉండవచ్చు. బీజేపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికే ఈ సరికొత్త డ్రామా ఆడుతున్నాయి,” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
అంటే కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయడం, దానికి కేంద్రం ఎంచుకున్న టైమింగ్ రెండూ కూడా చాలా కీలకమైనవని స్పష్టమవుతోంది. కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయడంతో కేసీఆర్, కేటీఆర్ మరికొందరు బిఆర్ఎస్ ముఖ్యనేతలను వెంటబెట్టుకొని నేడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అంటే కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నట్లు ‘గల్లీలో కుస్తీ… ఢిల్లీలో దోస్తీ’ కోసమే అని అనుకోకుండా ఉండగలమా?
అయితే బిఆర్ఎస్ పార్టీ నేతలు వాదిస్తున్నట్లు ఆమెను అరెస్ట్ చేయించి లోక్‌సభ ఎన్నికలలో వారి పార్టీని బీజేపీ దెబ్బతీయాలని భావిస్తోందా లేక శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి, పార్టీ ఖాళీ అయిపోతుంటే ఏమీ చేయలేని నిసహాయస్థితిలో ఢీలా పడిన కేసీఆర్‌కు మళ్ళీ ప్రజలలో సానుభూతి కల్పించి ఆదుకొనేందుకే ఇప్పుడు ఆయన కూతురుని అరెస్ట్ చేయించిందా?అనే రెండు ధర్మ సందేహాలకు లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేలోగానే సమాధానాలు లభించవచ్చు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…