తెలుగు వారి పట్టుదలను తెలంగాణా ఉద్యమ రూపంలో ఢిల్లీకి చాటిచెప్పి ఢిల్లీ పెద్దలను గడగడలాడించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది. ప్రజల కోరికను తెలుసుకుని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కష్టపడిన కేసీఆర్ ప్రజా ఆకాంక్షకనుగుణంగా కార్యాచరణ చేసి లక్ష్యాన్ని నెరవేర్చారు. అలాగే, కొన్ని దశాబ్దాల తెలంగాణా వాసుల కోరిక అయిన ప్రత్యేక రాష్ట్రం ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యమైందని విశ్వసించిన ప్రజలు కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ వర్గీయులనే గెలిపించి తెలంగాణా రాష్ట్ర అధికార పగ్గాలు కట్టపెట్టారు.
మరి అప్పుడు ప్రజాభిప్రాయానికి అంతటి విలువనిచ్చిన కేసీఆర్ మరి అధికారం వచ్చిన తర్వాత ఎందుకిలా చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల నుండి తాజా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల వరకు తెలంగాణా ప్రజలు మిగిలిన అన్ని పార్టీల ప్రతినిధులను కాదని, ఒక్క టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారినే నెత్తిన పెట్టుకున్నారు. అంటే పరోక్షంగా తెలంగాణా వాసులు కాంగ్రెస్, టి.డి.పి ప్రజాప్రతినిధులను నిర్మొహమాటంగా తిరస్కరించినట్లే కదా! ఆ పార్టీలనే కాదు, ఆ పార్టీ నేతలను కూడా వద్దని ప్రజలు డిక్లేర్ చేసినట్లే కదా!
అయితే కేసీఆర్ మాత్రం ప్రజలు తిరస్కరించిన వారికి తన పార్టీలో చోటు కల్పిస్తూ ప్రజాభిప్రాయానికి ద్రోహం చేస్తున్నారన్న భావనలు విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా పార్టీ సంఖ్యను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప, కేసీఆర్ లాభించే అంశం పెద్దగా ఏమీ లేదు. అయితే అసలు ఈ విషయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గుర్తించారా? అన్నది సందేహమే!





