
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ వాస్తును బాగా నమ్ముతారు. అలాగే యజ్ఞయాగాలు చేస్తుంటారు. ఈ రెంటి వలననే ఆయన తిరుగులేని అధికారం కొనసాగించగలమని గట్టిగా నమ్మేవారు. ఇంతకాలం అలాగే సాగింది కూడా. పాత సచివాలయానికి వాస్తు సరిగాలేదనే దానిలో ఏనాడూ అడుగుపెట్టలేదు. అందుకే పాత సచివాలయాన్ని కూలగొట్టించేశారు.
అందుకు ప్రతిపక్షాలు, మీడియా ఎన్ని విమర్శలు చేసినా ఆయన పట్టించుకోలేదు. దాని స్థానంలో వందల కోట్లు ఖర్చుపెట్టి ఇంద్రభవనం వంటి సచివాలయం నిర్మించుకొన్నారు. దానిలోకి ప్రతిపక్షాలను, మీడియాని ఏనాడూ అనుమతించలేదు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ని కూడా అనుమతించలేదు.
తన కొడుకు కేటీఆర్ కోసమే దానిని నిర్మించారని, మళ్ళీ గెలిస్తే తన కుర్చీలో కొడుకుని కూర్చోపెట్టాలనుకొన్నారని గిట్టనివారు చెప్పుకొంటారు. కానీ కేసీఆర్ వందల కోట్ల ప్రజాధనంతో ముచ్చటపడి కట్టుకొన్న ఆ ఇంద్రభవనంలో పట్టుమని 12 నెలలు కూర్చోలేకపోయారు. అంటే వాస్తు వర్కవుట్ కాలేదనుకోవాలేమో?
ఇక కేసీఆర్ చేసే రాజశ్యామల చండీ యాగాల కారణంగానే ఆయన శత్రువులను జయిస్తుండేవారని, ఆయనని మోడీ, అమిత్ షాలు కూడా తాకలేకపోయేవారని గుసగుసలు వినిపిస్తూనే ఉండేవి. కానీ రెండోసారి గెలిచేసరికి కేసీఆర్‌కు నేను తెలంగాణ గాంధీజీని, దళితుల పాలిత అంబేడ్కర్‌ని, మరీ ముఖ్యంగా… దైవాంశ సంభూతుడినని అని నమ్మడం ప్రారంభించారు. అలాగే ప్రచారం చేయించుకొన్నారు కూడా.
పాలాభిషేకాలు, యాదాద్రిలో తన శిల్పం చెక్కించుకోవడం, త్రిదండి చిన్న జీయర్ స్వామిని పక్కనపెట్టేయడం వంటివి ఇందుకు నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. కేసీఆర్ మొదట్లో సతీసమేతంగా కూర్చొని యాగాలు చేసేవారు. కానీ తర్వాత తర్వాత యాగాల ముగింపులో పూర్ణాహుతిలో మాత్రమే పాల్గొనేవారు. బహుశః తాను దైవాంశ సంభూతుడిగా భావిస్తుండటం వలననే కావచ్చు! బహుశః అందుకే ఆ యాగాలు కూడా ఫలించలేదేమో?
అలాగే అపర చాణక్యుడు అంటూ మీడియా, సొంత పార్టీ నేతలు కేసీఆర్‌ని మునగచెట్టు ఎక్కించేయడం కూడా బిఆర్ఎస్ కొంపముంచిందని చెప్పవచ్చు. ఎన్నికలలో ఆయన వ్యూహాలు ఏవీ ఫలించలేదు. వెదజల్లిన డబ్బు ఓట్లు రాల్చలేదు. చివరాఖరుగా పదేళ్ళ అభివృద్ధి, తెలంగాణ సెంటిమెంట్ కూడా బిఆర్ఎస్ పార్టీని గెలిపించలేకపోయాయి.
సాధారణంగా సినిమా ఫ్లాప్ అయిన విషయం మూవీ రివ్యూలు చూసిన తర్వాత దర్శకనిర్మాతలకు అర్దమవుతుంది. కనుక బిఆర్ఎస్ పార్టీ కూడా రివ్యూ వేసి చూసుకోక తప్పదు. ఆ రివ్యూలో కేసీఆర్ బొమ్మే కనబడుతుందని వేరే చెప్పక్కరలేదుగా!
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…