కీర్తి సురేష్ నటిస్తున్న పెంగ్విన్ అనే చిత్రం థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదల అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం ఆన్ లైన్ రైట్స్ ని చేజిక్కించుకుంది. ఈ నెల 19 నుండి సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా… కాసేపటి క్రితం సినిమాకు సంబంధించిన టీజర్ అమెజాన్ వారు విడుదల చేశారు.
దాదాపుగా నిముషన్నర ఉన్న టీజర్ లో విజువల్స్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. కథ గురించి ఎక్కువ బయటపెట్టకపోయినా, కీర్తి సురేష్ నటన బాగా కుదిరింది అనే అర్ధం అవుతుంది. విజువల్స్ బట్టి స్టోరీ కూడా గ్రిప్పింగ్ గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 11న విడుదలయ్యే ట్రైలర్ తో కథ మీద పూర్తి స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రూపొందించారు. మలయాళంలోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. కార్తికేయన్ సంతానం, కాల్ రామన్, ఎస్.సోమసేగెర్, కళ్యాణ్ సుబ్రమణియన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.
ఇప్పటికే తమిళంలో జ్యోతిక నటించిన పోన్ మగళ్ వందల్ అనే సినిమా డైరెక్టుగా ఆన్ లైన్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోద్వారా విడుదల అయ్యింది. అయితే ఆ సినిమా టాక్ అంతగా బాలేదు. దీనితో పెద్దగా ప్రభావం చూపించలేదు అనే చెప్పుకోవాలి. ఈ వారం లో బాలీవుడ్ సినిమా గులాబో సితాబో కూడా అమెజాన్ లో విడుదల అవుతుంది.





