ఇటీవల కాలంలో అధికారికంగా ఓ నిర్మాత కలెక్షన్స్ ప్రకటించి ఎన్ని రోజులు గడిచింది? గతాన్ని గుర్తు చేసుకుంటే కూడా ఎక్కడా తారసపడడం లేదా? కాస్త కష్టమైన విషయమే. కానీ, ప్రస్తుతం నిర్మాత కాకపోయినా, మెగాస్టార్ చిరంజీవికి ‘బ్యాక్ బోన్’ అయిన అల్లు అరవింద్ “ఖైదీ నంబర్ 150” కలెక్షన్స్ ను ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసింది. మెగాస్టార్ రేంజ్ ఇది అని చూపించుకోవడానికి చెప్పారో లేక సినిమాకు లభిస్తున్న టాక్ రీత్యా మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపేందుకు చెప్పారో గానీ, అవాక్కయ్యే ఫిగర్లు చెప్పారు.
చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ తొలి రోజున 47.07 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని, టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 50 కోట్లు అందుకున్న సినిమాగా నిలిచిందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల 45 వేలు వసూలు చేసిందని, కర్ణాటకలో 4.70 కోట్లు కలెక్ట్ చేసిందని, అమెరికాలో 1.22 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిందని చెప్పారు. ఇతర దేశాల్లో 3,20,000 డాలర్లు వసూలు చేసిందని, ఒడిశాలో 12 లక్షలు, తమిళనాడులో 20 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 58 లక్షలు వసూలు చేసిందని ఏరియాల వారీగా వివరించారు.
ఈ సందర్భంగా మరిన్ని విశేషాలు చెప్తూ… ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అధిక సంఖ్యలో హాజరైన చిరంజీవి అభిమానులను చూసి ఆశ్చర్యపోయామని, ఈ అమోఘమైన ఆ స్పందన చూసి, 11వ తేదీన ఈ చిత్రం విడుదల చేసినా ఫర్వాలేదని అనుకున్నామని, అయితే, మమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఈ చిత్రానికి స్పందన వచ్చిందని, రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించిందని అన్నారు. సాధారణంగా శుక్రవారం నాడు కొత్త సినిమాను విడుదల చేస్తారని, కానీ, బుధవారం నాడు చిరంజీవి చిత్రాన్ని విడుదల చేశామని, చిరంజీవి సత్తా మేరకు ఈ చిత్రానికి కలెక్షన్లు ఉన్నాయని అన్నారు.
పదేళ్ల తర్వాత మళ్లీ నటించిన చిరంజీవిని చూడాలనే అభిమానం ప్రభావం ఈ చిత్రంపై ఎక్కువగా ఉందని, చిరంజీవి ఎలా ఉన్నారు? ఎలా చేస్తారు? ఒక నటుడిగా ప్రేమించిన వాళ్లందరూ ఆయన్ని చూడాలని అనుకుంటారు. ఇలా మట్లాడుతున్నందుకు వి.వి. వినాయక్ గారు క్షమించాలి… ఈ చిత్రం సబ్జెక్టు, మిగతా విషయాల ప్రభావం కన్నా చిరంజీవి గారి ప్రభావం వల్లే ఈ సినిమాకు ఊహించని స్పందన వచ్చింది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి విపరీతమైన స్పందన వచ్చింది. మిడ్ వీక్ లో ఈ చిత్రం రిలీజు అయినప్పటికీ యూఎస్ లో భారీగా కలెక్షన్లు రాబట్టిందని అరవింద్ పేర్కొన్నారు.



