సూపర్ స్టార్ మీద కామెంట్లతో ఏం సాధిస్తున్నారు

Superstar Rajinikanthఏ వేదికకైనా సభామర్యాదనేది ఒకటుంటుంది. అంటే మనల్ని ఎవరైనా ఒక ప్రత్యేక సందర్భానికి అతిథులుగా పిలిచినప్పుడు దానికి కారణమైన మూల వ్యక్తులు వ్యవస్థాపకుల గురించి ఓ నాలుగు మంచి మాటలు చెప్పాలి. అది గౌరవం కూడా. సూపర్ స్టార్ రజనీకాంత్ అదే చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు గెస్ట్ గా వచ్చి అన్నగారితో తన అనుబంధాన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు నడిపిస్తున్న చంద్రబాబునాయుడుని ప్రశంసలతో ముంచెత్తారు.

ఇందులో ఎలాంటి దురుద్దేశమూ ఎవరినో టార్గెట్ చేయాలన్న ప్లానూ లేదు. కానీ ఈ ప్రసంగానికి రాజకీయ రంగు పులిమేశారు. కొడాలి నాని ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని భాషలో రజనిని నానా మాటలు అనేశారు. మాములుగా ప్రతిపక్ష పార్టీలకు వారిని ఎన్నయినా అనొచ్చు. పొలిటికల్ స్ట్రాటజీలో అదొక భాగం. కానీ రజనీకాంత్ తన స్వంత రాష్ట్రం తమిళనాడులోనే రాజకీయం చేసే ఆసక్తి లేక పెట్టాలనుకున్న పార్టీ ఆలోచన విరమించుకుని ఇంత వయసులోనూ పూర్తిగా సినిమాలకు అంకితమైపోయారు.

ADVERTISEMENT

ప్రత్యేక కారణం ఉంటే తప్ప రజని బయటి ఈవెంట్లకు వచ్చే పరిస్థితిలో లేరు. దానికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఒక కారణం. అయినా వచ్చారంటే కేవలం ఎన్టీఆర్ మీదున్న గౌరవం, చంద్రబాబుతో ఉన్న స్నేహం, బాలకృష్ణతో ఉన్న బంధం ఇంతే. ఆ మాత్రం దానికే సూపర్ స్టార్ ఇప్పటికిప్పుడు టిడిపిలో చేరతారేమో అన్నంత అభద్రతా భావంతో ఇన్నేసి మాటలు అనడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న నలుగురు టాప్ సీనియర్ల కంటే రజినీకాంత్ ఎంతో ముందు ఇండస్ట్రీకి వచ్చారని మర్చిపోకూడదు.

ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారాల్లో ఇతర బాషల స్టార్లను చులకన చేయడం వల్ల వచ్చే లాభం ఏముండదు. పైగా రజనికి తమిళంలోనే కాదు తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్, ఫేస్ బుక్కులో అప్పుడే దీని పట్ల నిరసన వ్యక్తమవుతోంది. బయటి వ్యక్తులకు అందులోనూ అంత స్టేచర్ ఉన్న పెద్దమనిషి గురించి ఇలాగేనే మాట్లాడేదంటూ ఫ్యాన్స్ కస్సుమంటున్నారు. త్వరలో విడుదల కాబోయే జైలర్ కు ఆటంకాలు కలిగిస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా విమానం ఆకాశంలో ఉన్నప్పుడు కింది నుంచి హారన్ పదే పదే వాయించడం వల్ల ఆ పైలట్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. మ్రోగించినవాడి చెవులకు చిల్లులు పడటం తప్ప.

ADVERTISEMENT
Latest Stories