వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎంతగా రెచ్చిపోయారో అందరూ చూశారు. కనుక ఎన్నికలలో వైసీపీ ఓడిపోగానే రెడ్‌బుక్ ప్రకారం ముందుగా ఆయనతోనే కేసుల ఎపిసోడ్స్ మొదలవుతాయని అందరూ అనుకున్నారు. ఆయన కూడా అదే అనుకున్నారు.
కూటమి ప్రభుత్వానికి జగన్ కనీసం ఆరు నెలలు సమయం ఇవ్వకుండానే విమర్శలు, ఆరోపణలు, ధర్నాలు, దీక్షలు మొదలుపెట్టేశారు. కానీ కూటమి ప్రభుత్వం కొడాలి నానికి 7-8 నెలల సమయం ఇచ్చింది. కానీ అది తనకు ‘బఫర్ టైమ్’ మాత్రమే అని ఆయన బాగానే గ్రహించారు.
కనుక ఈ 9 నెలల్లో పార్టీ కార్యక్రమాలలో, రాజకీయాలలో పెద్దగా హడావుడి చేయలేదు. ఒకటి రెండుసార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మొక్కుబడిగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి సైలంట్ అయిపోయారు. అది బఫర్ టైమ్ పెంచుకునేందుకే ఉపయోగపడుతుంది తప్ప కేసుల నుంచి విముక్తి కల్పించదని ఆయనకీ బాగా తెలుసు. ఆయన భయపడుతున్నట్లే కేసులు మొదలయ్యాయి. కొంతమంది అనుచరులు ఇప్పటికే లోపలకు వెళ్ళారు.
కనుక తనకీ డేట్ దగ్గర పడుతోందని కొడాలి నానికి మనసులో ఆందోళన మొదలైందో ఏమో ఈరోజు ఉదయం ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చేరారు. వైద్యులు మొదట గ్యాస్ట్రిక్ సమస్య అనుకున్నా అన్ని పరీక్షలు చేసిన తర్వాత గుండెలో సమస్య ఉందని గుర్తించి చికిత్స ప్రారంభించారు.
కొడాలి నానికి కేసుల బెడద ఎలాగూ తప్పదు. వాటి కారణంగా ఆందోళన చెందినందుకు గుండె పోటు కూడా తెచ్చుకున్నారు.




