ఏపీ రాజకీయాల్లో తనకు ప్రతికూలంగానే కాదు కూటమికి అనుకూలంగా గళం విప్పినా చాలు వారిపై విమర్శలతో విరుచుకుపడే వైసీపీ నేతలు.. బిఆర్ఎస్ విషయంలో మాత్రం ఎందుకో ‘మూగనోము’ పట్టినట్టు కనిపిస్తున్నారు.
తాజాగా బిఆర్ఎస్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. తమ బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాటి సీఎం కేసీఆర్ తెలంగాణ నీటి హక్కుల కోసం ఎంతలా పోరాడేవారో చెప్పే క్రమంలో 2019 – 2024 మధ్య ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నడుమ జరిగిన కొన్ని సమావేశాల్లోని అంశాలను ఉటంకించారు.
“బిడ్డా.. నువ్వు రాయలసీమ ప్రాజెక్ట్ ఆపుతావా? లేదా? లేకుంటే ఆలంపూర్ కాడా బ్యారేజ్ కడతా.. నీకు నీళ్లు ఆపుతా” అంటూ నాటి ఏపీ సీఎం జగన్ ను కేసీఆర్ హెచ్చరించినట్టు హరీష్ మీడియా ముందు బహిరంగంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సమక్షంలో జరిగిన సమావేశపు మినిట్స్ లో ఈ అంశాలు ఉన్నాయంటూ హరీశ్, జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసినా వైసీపీ ‘నో కామెంట్స్’ అంటూ సరిపెట్టుకుంటుందా? సర్దిచెప్పుకుంటుందా?
తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు కేసీఆర్, జగన్ గల్లా పట్టుకుని ఏపీలో ప్రాజెక్టులను ఆపేసారు అనేవిధంగా నాటి తెలంగాణ నీటి పారుదల శాఖామంత్రి హరీష్ రావు జగన్ పై ఈ స్థాయి ఘాటు విమర్శలు చేసినా వైసీపీ మాత్రం వాటిని ప్రశంసలుగా భావిస్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
మరోవైపు సొంత చెల్లి షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను రాష్ట్ర సీఎం బాబుకి అందించిన సందర్భంలో ఆమె వైఎస్ కుటుంబ సభ్యురాలు అనే కనీసం సంస్కారం కూడా లేకుండా జగన్ ‘సాక్షి’ నుంచి వైసీపీ ‘సోషల్ మీడియా’ వరకు షర్మిలపై వ్యక్తిగత దాడి చేసింది.
ఇక తన కుమార్తె షర్మిలకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్న కారణంగా జగన్ కన్న తల్లి విజయమ్మ పై కూడా కనికరం చూపని వైసీపీ జగన్ గల్లా పట్టుకుని మరి రాయలసీమ ప్రాజెక్టులను కేసీఆర్ ఆపారు అంటూ మీడియా సాక్షిగా హరీష్ ప్రకటనలు చేస్తున్నా వైసీపీ నుంచి ప్రతిస్పందన కరువయ్యింది వై?




