2025లో హిందీలో విడుదలైన “సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగోన్” అనే సినిమా హిందీ ఇండస్ట్రీలోనే ఒక మెమరబుల్ ఫిలిం. 2014లో రూపొందిన ఒక డాక్యుమెంటరీ ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రానికి కొన్ని ఫిలిం ఫెస్టివల్స్ లో మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. నిజానికి ఆ డాక్యుమెంటరీని కూడా ఒక ఊరి కథను ఆధారంగా తెరకెక్కించారు. తెలుగులోనూ “కేరాఫ్ కంచర్లపాలెం” కూడా ఇలానే ఒక ఊరి కథగా రూపొందింది, అందులో నటీనటులందరూ దాదాపుగా ఆ ఊరి వాళ్లే.
చాన్నాళ్ల తర్వాత ఆ ఫార్మాట్ లో మరో సినిమా వస్తోంది. దాని పేరు “కొత్త సినిమా”. అజర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ద్వారా 100 మంది కొత్త ఆర్టిస్టులు పరిచయమవుతున్నారు. అందరూ గోదావరిఖని ఊరివాళ్లే. షూటింగ్ కూడా అక్కడే చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆ ఊరిలోనే జరిగింది.
సాధారణంగా ఈ తరహా సినిమాల్ని ఇండిపెండెంట్ మూవీస్ కేటగిరీలో వేసేస్తూ ఉంటారు. అయితే.. మేకింగ్ & క్వాలిటీ విషయంలో ఈ “కొత్త సినిమా” అనేది రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఒక మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాలకి ఈ తరహా కొత్త సినిమాలు చాలా అవసరం. అప్పుడే కొత్త నటీనటులు, టెక్నీషియన్లు వెండితెరకు పరిచయమవుతుంటారు. వెరైటీ ఆఫ్ సినిమా అనేది కూడా కనిపిస్తుంది.
ఈ సినిమాకి ఎలాంటి రిలీజ్ దొరుకుతుంది, ఎలాంటి హిట్ అవుతుంది అనేది అప్రస్తుతమే అయినప్పటికీ.. ఈ తరహా సినిమాలు, ప్రయత్నాలు ఎక్కువగా జరగడం అనేది ఇండస్ట్రీకి ఒక కొత్త నీరు. అయితే.. ఈ సూపర్ బాయ్స్ ఆఫ్ గోదావరిఖని ఆడియన్స్ ను ఏమేరకు ఎంగేజ్ చేస్తారు అనేది చూడాలి.




