ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలన్న లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. ఈ మాటలనే సీనియర్ హీరో, బిజెపి నేత కృష్ణంరాజు స్పష్టంగా వెల్లడించారు. ఏపీలో బిజెపిని ఎదగనివ్వకుండా అధికార పార్టీ తెలుగుదేశం అడ్డు పడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే బిజెపి లేవనెత్తిన ఈ అంశంపై అప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
వాస్తవ రూపానికి వస్తే అసలు బిజెపికి ఏపీలో ఓటింగ్ శాతం లేదు. కాంగ్రెస్ చేసిన విభజన ప్రక్రియ, టిడిపితో సాన్నిహిత్యం, పవన్ ప్రచారం ఇవన్నీ కాస్త బిజెపికి అనుకూలంగా మారాయి. తెలుగుదేశం బంధం వీడితే బిజెపి పరిస్థితి ఏమిటన్నది అగమ్యగోచరమే. ఈ విషయం బిజెపి వర్గీయులకు కూడా తెలిసిందే. అందుకే టిడిపితో సాన్నిహిత్యం ఉన్నపుడే పరిస్థితులు చక్కదిద్దుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ, రాజకీయంగా ఏపీలో బిజెపికి ప్రాతినిధ్యం వహించేందుకు సరైన నాయకుడు లేరు. ఈ కారణంగానీ క్షేత్రస్థాయిలో తన బలం పెంచుకోవడంలో విఫలమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
బిజెపి నేతల వైఖరి ఇలా ఉంటే, ఏపీ ప్రజల ఆదరణకు నోచుకోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి తమకు అడ్డుపడుతోందని టిడిపి నేతలు అంటున్నారు. విభజన హామీలను అమలు చేయలేకపోగా, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి కీలక ప్రతిపాదనలను గాలికొదిలేసి, టిడిపిపై ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా రాజకీయం నడుపుతోందని, ఇవే కాకుండా రాష్ట్ర రెవిన్యూను పూడ్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉండగా, కనీసం ఆ లోటును పూడ్చకుండా రాష్ట్రాన్ని ధీన స్థితికి చేరుస్తోందని… ఇదంతా కూడి రాష్ట్ర సర్కార్ పై వ్యతిరేకత పెరిగి తద్వారా ఏపీలో ఎదగాలనే బిజెపి కుచంచల రాజకీయానికి నిదర్శనమని టిడిపి నేతలు అంతర్గతంగా చర్చించుకునే అంశాలు.
అయితే ఇరు పక్షాల వాదనలో వాస్తవమున్నా, కృష్ణంరాజు చెప్తున్నట్లు బిజెపిని ఎదగనివ్వకుండా టిడిపి చేస్తున్న రాజకీయం వలన ఒక్క బిజెపికి మాత్రమే నష్టం. అదే కేంద్ర ప్రభుత్వంలో బిజెపి చేస్తున్న రాజకీయం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మరి ఏ పార్టీ చేస్తున్న రాజకీయం ప్రమాదకరమో ప్రజలే ఆలోచించుకోవాలని విశ్లేషణలు వస్తున్నాయి.



