నిజమే! ఎన్నికలు జరగాలి.. ప్రజాభిప్రాయం తెలియాలి!

KTR on Telangana Graduate MLC polls

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేడు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ మాయమాటలు నమ్మి పాలిచ్చే ఆవును కాదని ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారు. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు దాని ఫలితం అనుభవించాల్సిందే. అంతవరకు ప్రజలు ఎదురుచూడాల్సిందే. కనుక అంతవరకు ప్రజలకు ఇష్టం లేకపోయినా ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకు మోయాల్సిందే.

జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఈ కాంగ్రెస్‌, బిజేపిల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారికీ తెలియజేసేందుకు మధ్యలో ఇటువంటి చిన్న చిన్న అవకాశాలు లభిస్తుంటాయి. కనుక త్వరలో జరుగబోయే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు అందరూ తప్పకుండా బీఆర్ఎస్‌ పార్టీని గెలిపించుకోవాలి. ఇదే… ప్రభుత్వానికి మీరిచ్చే బలమైన సందేశం అవుతుంది.

ADVERTISEMENT

మూడేళ్ళుగా కేసీఆర్‌ బయటకు రాకపోయినా అయన ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారని వినాయక మండపాల వద్ద వినిపించిన ఆయన పాటలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పాలనలో గాడి తప్పినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టగలవారు ఆయనొక్కరే.

కనుక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలు ఇకపై జరుగబోయే ప్రతీ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీని గెలిపిస్తూ మళ్ళీ కేసీఆర్‌ రావాలనే మన బలమైన ఆకాంక్షను కాంగ్రెస్‌, బిజేపిలకు తెలియజేద్దాం,” అని కేటీఆర్‌ అన్నారు.

ప్రజల విచక్షణ, వారి తీర్పు పట్ల బీఆర్ఎస్‌ నేతలకు ఉంది గనుకనే ఇంత ధైర్యంగా వారిని ఉద్దేశ్యించి ఈవిధంగా మాట్లాడగలుగుతున్నారని చెప్పవచ్చు. వారు మళ్ళీ అధికారంలో రావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ అందుకోసం ప్రజలు కాంగ్రెస్‌ పాలనను వ్యతిరేకిస్తున్నారని, తమనే ఎన్నుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదన్నట్లు మాట్లాడటమే తప్పు.

ఏది ఏమైనప్పటికీ, కేటీఆర్‌ చెప్పిన్నట్లు ఎన్నికలు జరగాలి.. ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. కాంగ్రెస్‌, బిజేపిల కంటే బీఆర్ఎస్‌ పార్టీకే ఈ అవసరం చాలా ఎక్కువ.

ADVERTISEMENT
Latest Stories