కేటీఆర్ భవిష్యత్ కి కేసీఆర్ గతం అవసరమా.?

KTR’s struggle for future leadership in BRS and Telangana politics

బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడిగా ఎదగాలనుకుంటున్న కేటీఆర్ ఇటు పార్టీ శ్రేణుల నమ్మకాన్ని గెలవాలి, అలాగే అటు తెలంగాణ ప్రజల మనసు మెప్పించాలి, దానికి తోడు ప్రత్యర్థి పార్టీ నాయకులను బయపెట్టాలి.

అయితే ప్రస్తుతానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఇవన్నీ సాధించారా అంటే ఇప్పటికి ఈ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు. అటు పార్టీ విషయానికొస్తే బిఆర్ఎస్ ఓటమి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ADVERTISEMENT

అలాగే పార్టీ నాయకులకు సైతం కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికల పై ఎటువంటి ఆదేశాలు ఇవ్వడం లేదు, అలాగని పార్టీ కార్యకలాపాల పై దిశా నిర్దేశం చెయ్యడం లేదు. సార్వత్రిక ఎన్నికల ఓటమి తరువాత నుంచి జూబ్లీహిల్స్ పరాభవం వరకు పార్టీకి అన్ని తానే అనేలా కేటీఆర్ నడుచుకున్న పార్టీ క్యాడర్ ని మెప్పించారా.? అంటే అందుకు కేటీఆర్ కి పోటీగా హరీష్ ఉన్నారు.

పార్టీలో కేసీఆర్ వారసత్వం కింద కేటీఆర్ కి హక్కు ఉన్నా ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెరాస లో కేసీఆర్ తరువాత స్థానం హారిష్ కే దక్కుతుంది. అయితే ఇప్పుడు తెరాస, బిఆర్ఎస్ గా మారినంత మాత్రానా హరీష్ కేటీఆర్ కోసం పార్టీలో తనకున్న పట్టు ని సడలించుకుంటారా.? అందుకు హరీష్ మద్దతుదారులు అంగీకరిస్తారా.?

అయితే ఇందుకు కేటీఆర్ ముందు హరీష్ రావు ని మెప్పించి ఆ తరువాతనే పార్టీ పగ్గాలు చేపట్టాలి. లేకుంటే కవిత ఆరోపిస్తునట్టు, ప్రత్యర్థులు ఆశపడుతున్నట్టుగా బిఆర్ఎస్ లో చీలిక తప్పనిసరి అవుతుంది. ఆ ప్రయత్న లోపమే కల్వకుంట్ల కుటుంబంలోని కేటీఆర్ – కవిత మధ్య రాజకీయ చీలికకు కారణమైంది.

ఇక పార్టీ లో కేటీఆర్ పరిస్థితి ఇలా ఉంటే అటు ప్రజలలో కూడా కేటీఆర్ తనదైన ముద్ర వేయాల్సి ఉంటుంది. మాజీ ఐటీ మంత్రిగా, హైద్రాబాద్ లో అభివృద్ధిని పరుగులు పెట్టించిన నాయకుడిగా కేటీఆర్ కి యువతలో మంచి గుర్తింపే ఉంది. కానీ ఆ గుర్తింపు కేవలం హైదరాబాద్ కి మాత్రమే పరిమితమయ్యింది.

తెలంగాణలోని పల్లె ప్రజల గుర్తింపు లేకుండా, వారి మద్దతు సంపాధించకుండా కేటీఆర్ ఎప్పటికి రాజకీయంగా ముందుకెళ్లలేరు అనే విషయాన్ని గ్రహించాలి. కేసీఆర్ కానీ హరీష్ కానీ తమ రాజకీయంతో గ్రామీణ ప్రజల మనసు గెలిచారు, అలాగే తమ భవిష్యత్ నాయకులు వీరే అనే నమ్మకాన్ని వారిలో సృష్టించగలిగారు కాబట్టి ఇప్పటికి ఆ ఇద్దరి నాయకుల పట్ల తెలంగాణ రాజకీయాలలో సమ భావన ఏర్పడింది.

దాని ఫలితమే పదేళ్ల సుదీర్ఘ అధికారం బిఆర్ఎస్ కి దక్కింది, కేసీఆర్ కి ముఖ్యమంత్రి పదవి వరించింది. కేటీఆర్ ఇప్పుడు అటువంటి నమ్మకాన్ని పొందాలి . అలాగే ఇటు ప్రజలు అటు పార్టీ శ్రేణులతో పాటు ప్రత్యర్థి పార్టీల నాయకులకు సైతం కేటీఆర్ తన రాజకీయంతో చెమటలు పట్టించగలగాలి.

తమ ప్రధమ ప్రత్యర్థి కేటీఆరే అనేలా ప్రత్యర్థి పార్టీల నాయకులు తమ రాజకీయం మొత్తాన్ని కేటీఆర్ చుట్టే నడిపేలా చెయ్యగలిగితే దాని ఫలితం తెలంగాణ ఓటర్ల మీద పడుతుంది. అది ఎన్నికలను ప్రభావితం చేయగలుగుతుంది. అయితే దానిని కేటీఆర్ సరైన పద్దతిలో ఒడిసిపట్టుకోగలిగితే తానూ ఆకాంక్షిస్తున్న అందలం ఎక్కడానికి అవకాశం ఉంటుంది.

గతంలో చేసిన పొరపాట్లు, రాజకీయ తప్పిదాలను సరిచేసుకుంటూ, సద్విమర్శ లను స్వీకరిస్తూ కేటీఆర్ ముందుకెళ్లగలిగితే బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడిగానే కాదు భవిష్యత్ తెలంగాణ నాయకుడిగా కూడా ఎదగగలరు. అయితే ఈ ప్రకియ మొత్తానికి కేసీఆర్ గత రాజకీయ అనుభవం తప్పనిసరే అవుతుంది. అంటే కేటీఆర్ భవిష్యత్ కి కేసీఆర్ గతం అత్యవసరం అన్నమాట.

ADVERTISEMENT
Latest Stories