కేటీఆర్‌ మాట్లాడకుండా ఉంటే చాలు… కానీ ఊరుకోరే!

KTR and Revanth Reddy clash over hotel and asset allegations

కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు వందల ఎకరాల భూములు ఉన్నాయని సిఎం రేవంత్‌ రెడ్డి శాసనసభలో ఆరోపించినప్పుడు ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. వాటిపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు ఊహించినంతగా పెద్దగా దుమారం రేగలేదు.

రేవంత్ ఇచ్చిన ఈ లీడ్‌ని కాంగ్రెస్‌ నేతలు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. అలవాటు ప్రకారం వారు ‘తూతూ మంత్రం’గా బీఆర్ఎస్‌ నేతల ఫామ్‌హౌసు యాత్రలు చేసి ‘మమ’ అనిపించేశారు. అదే.. వారు రైతులను మీడియాతో మాట్లాడించి ఉండి ఉంటే ఆ ఎఫెక్ట్ వేరేలా ఉండేది. కనుక బీఆర్ఎస్‌ పార్టీ చాలా సులువుగా ఈ అంశంపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించగలిగింది.

ADVERTISEMENT

కానీ ‘హైటెక్ సిటీలో కేటీఆర్‌కు మూడు స్టార్ హోటల్స్‌ ఉన్నాయంటూ’ రేవంత్ రెడ్డి కేటీఆర్‌పై సంధించిన రెండో అస్త్రం మాత్రం, అటు బీఆర్ఎస్‌ పార్టీలో, తెలంగాణ సమాజంలో ప్రకంపనలు సృష్టించింది.

మొదటి అస్త్రం కాంగ్రెస్‌ నేతల అలసత్వం వలన విఫలమైతే, ఈ రెండో అస్త్రం కేటీఆర్‌ వాచాలత వల్లనే పెను విస్పోటనం సృష్టించడం విశేషం.

ఈసారి కాంగ్రెస్‌ సోషల్ మీడియా వారియర్స్ రంగంలో దిగి ‘హైదరాబాద్‌లో ఉండేందుకు మాకు సారిన ఇల్లు కూడా లేదన్న’ కేటీఆర్‌ మాటలను, ‘అవును నాకు మూడు స్టార్ హోటల్స్‌ ఉన్నాయి. ఉంటే తప్పా?’ అనే మాటలను కలిపి వీడియోలు తయారుచేసి వైరల్ చేశారు.

‘ఉండేందుకు ఇల్లు కూడా లేని కల్వకుంట్ల కుటుంబానికి మూడు స్టార్ హోటల్స్‌, ఫామ్‌హౌసులు, వందల ఎకరాలు భూములు, వేలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? అనే వారి ప్రశ్న ప్రజలకు బాగా చేరింది.

ఇలాంటప్పుడు కేటీఆర్‌ ఆచితూచి మాట్లాడాల్సి ఉండగా మళ్ళీ, ‘మా తాతలు నేతులు తాగారన్నట్లు’ మాట్లాడటం, ‘నా పెళ్ళాం బిడ్డలకు బువ్వ పెట్టడానికి నేను వ్యాపారాలు చేయడం తప్పా?

నేను 2009 ఎన్నికల అఫిడవిట్‌లోనే నాకు హోటల్స్‌ ఉన్నాయని పేర్కొన్నాను. రేవంత్ రెడ్డి ఏదో వాస్కోడిగామా, కొలంబస్‌లా కొత్తగా కనిపెట్టినట్లు వాటి గురించి చెప్పి నా హోటల్స్‌కు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారంటూ’ కేటీఆర్‌ మాట్లాడిన ప్రతీ మాటని కాంగ్రెస్‌ సోషల్ మీడియా వారియర్స్ అందిపుచ్చుకొని తిరిగి ఆయనపైనే ప్రయోగించారు.

వారిలో కొంతమంది అత్యుత్సాహంతో కేటీఆర్‌ హోటల్స్‌ వద్ద నిలబడి రీల్స్ చేసి ‘ఇదిగో మన తెలంగాణను దోచుకొని కేటీఆర్‌ నిర్మించుకున్న స్టార్ హోటల్స్‌ ఇవే..’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కానీ ఇలాంటి వ్యవహారాలపై మీడియా, ప్రజలు కేవలం వారం పదిరోజులలోనే ఆసక్తి కోల్పోతారు. కనుక అంతవరకు కేటీఆర్‌ మళ్ళీ ఏమీ మాట్లాడకుండా ఉంటే చాలు. కానీ ఊరుకోవడం లేదు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. వారికి కొత్త అస్త్రాలు అందిస్తూనే ఉన్నారు. ఎందువల్లనంటే, 1. వాచాలతను వాక్చాతుర్యమనుకోవడం 2.కేసీఆర్‌నే మట్టి కరిపించిన సిఎం రేవంత్‌ రెడ్డిని ఇంకా తక్కువగానే అంచనా వేస్తుండటం.

ఏతావాతా తేలిందేమిటంటే, కేటీఆర్‌ కాస్త మాట్లాడటం తగ్గించుకోవాలని! సిఎం రేవంత్‌ రెడ్డి దేశముదురు కాంగ్రెస్‌ నేతలను నమ్ముకోవడం కంటే కాంగ్రెస్‌ సోషల్ మీడియా వారియర్స్‌ని నమ్ముకోవడమే బెటర్ అని!

ADVERTISEMENT
Latest Stories