హైదరాబాద్ నగరం రంగు మార్చుకోబోతోంది. గత చరిత్ర చవిచూడని విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో గ్రేటర్ హైదరాబాద్ నగరం ‘గులాభీ’ మయం కాబోతోంది. ఈ విజయానికి ప్రధాన కారకులు కేటీఆర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే హైదరాబాద్ ను కేటీఆర్ చేతిలో పెడతానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కార్యక్రమాన్ని బహుశా తన ప్రెస్ మీట్ లో వ్యక్తపరచవచ్చు.
ఇక, తన నాన్న చిరకాల వాంఛ అయినటువంటి హైదరాబాద్ పీఠాన్ని సాధించి పెట్టడంతో… కేటీఆర్ అభిమానులు ఓ ప్రత్యేక ఫోటోను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. హైదరాబాద్ కుర్చీని కేసీఆర్ చేతిలో పెడుతూ బ్యాక్ గ్రౌండ్ లో హైదరాబాద్ నగర ముఖచిత్రంతో పాటు “నాన్నకు ప్రేమతో” టైటిల్ తో కూడిన డిజైన్ ఎంతగా ఆదరణ పొందుతోంది అంటే… ఈ ఫోటోను స్వయంగా కవిత ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.
“నాన్నకు ప్రేమతో” సినిమాలో తన తండ్రి చివరి కోరికను తీర్చడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టం పడ్డారో అదే విధంగా కేసీఆర్ చిరకాల వాంఛ నెరవేర్చడానికి కేటీఆర్ కూడా అంతే కష్టపడి సాధించారని టీఆర్ఎస్ అభిమాన వర్గాలు సంతోషంలో మునిగి తేలుతున్నాయి.





