రాజకీయాలలో హుందాతనం కూడా వైసీపీ సొంతం?

Lakshmi Parvathi on political decorum

‘మాట తప్పను… మడమ తిప్పను,’ పేటెంట్ హక్కులు వైసీపీ సొంతం. ఇప్పుడు ‘రాజకీయాలలో హుందాతనం పాటించడంపై కూడా పేటెంట్ హక్కులు వైసీపీ సొంతం చేసుకుంది!

వైసీపీ నేత లక్ష్మీపార్వతి కొత్తగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఇతర పార్టీల నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి విమర్శలు చేయడం సరికాదని, రాజకీయాలలో హుందాతనం ఉండాలని హితవు పలికారు. జగన్ వ్యక్తిగత జీవితం గురించి టీడీపీ, జనసేన నాయకులు చాలా నీచంగా మాట్లాడుతున్నా, ఆయన మాత్రం హుందాగానే వ్యవహరిస్తున్నారు. అలాగే వైసీపీలో ఎవరూ కూడా ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని కట్టడి చేశారు.

ADVERTISEMENT

చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ ముగ్గురూ కూడా ఈ విధంగానే నడుచుకోవాలని కోరుకుంటున్నాను. గత 30 ఏళ్ళుగా నేను ఇదే చెబుతున్నాను. కానీ టీడీపీ నేతల తీరు మారడం లేదు,” అంటూ లక్ష్మీపార్వతి మండిపడ్డారు.

ఇతరులకు సుద్దులు చెప్తున్నా ఆమె మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడతారో అందరికీ తెలుసు. గత 30 ఏళ్ళుగా ఆమె సీఎం చంద్రబాబు నాయుడుని దూషిస్తూనే ఉన్నారు. నందమూరి బాలకృష్ణతో సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల గురించి అనుచితంగా మాట్లాడుతూనే ఉంటారు.

పవన్ కళ్యాణ్‌, నారా లోకేష్‌ గురించి తాను ఎంత అనుచితంగా మాట్లాడానో ఆమె మరిచిపోయినట్లున్నారు. కానీ ఏనాడూ వారెవరూ తిరిగి ఆమెకు బదులివ్వలేదు. అంటే రాజకీయాలలో హుందాతనం ఎవరు పాటిస్తున్నారో అర్థమవుతూనే ఉంది.

నాడు శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుని, రాజకీయాలతో సంబంధమే లేని ఆయన సతీమణి గురించి దారుణంగా మాట్లాడుతుంటే సభలోనే ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముసిముసినవ్వులు నవ్వారు తప్ప తప్పని వారించలేదు.

ఆ తర్వాత ఎన్నికలలో టీడీపితో జనసేన పొత్తు పెట్టుకుందనే అసూయతో, పవన్ కళ్యాణ్‌ వైవాహిక జీవితం గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత చులకనగా అవహేళనగా మాట్లాడేవారో అందరికీ తెలుసు.

ఈ కారణంగా ఎన్నికలలో దారుణంగా ఓడిపోయి, అధికారం కోల్పోయినా జగన్‌ తీరులో మార్పు రాలేదు. తన కంటే వయసులో, రాజకీయ, పాలనానుభవంలో, తెలివితేటలలో ఏవిధంగా చూసినా పది మెట్లు పైనే ఉన్న సిఎం చంద్రబాబు నాయుడుని రాళ్ళతో కొట్టాలని, బీపీ వచ్చి గుండె ఆగి చనిపోవాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో హుందాతనం పాటించాలని వైసీపీ నేతలకు చెప్పారంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.. కదా?

రాజకీయాలలో హుందాతనం పాటిస్తున్నందుకే టీడీపి, జనసేన, బిజేపిలను ప్రజలు ఆదరిస్తున్నారు. అది పాటించనందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో మరోసారి వైసీపీని దారుణంగా ఓడించారు. అయినా ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. ఇతరులకు సుద్దులు చెప్పడం మానుకోవడం లేదు కూడా!

ADVERTISEMENT
Latest Stories