వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆ పార్టీ ఎమ్మెల్సీ గా, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులుగా, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా…ఇలా వైసీపీ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించే లేళ్ళ అప్పిరెడ్డి నవంబర్ 6న గుంటూరులో అరెస్టయ్యారు.
తాజాగా ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్ ల తరలింపు విషయంలో లేళ్ళ అప్పిరెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు, అలాగే బ్యాలెట్ బాక్సుల తరలింపుకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
దీనితో ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా రోడ్డు మీద ధర్నాకు దిగారని, బ్యాలెట్ బాక్స్ లలో ఒకదానిని లేళ్ళ తన స్వాధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నం చేశారనే ఆరోపణలతో లేళ్ళ అప్పిరెడ్డి ని పోలీసులు అరెస్టు చేసి గుంటూరు సబ్ జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ నేతలు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, వరుడు కళ్యాణి లేళ్ళ పరామర్శ కోసం గుంటూరు సబ్ జైలుకి వెళ్లి మీడియా ముందు ఇది కూటమి కక్షపూరిత రాజకీయానికి నిదర్శనంటూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు.
అయితే వైసీపీ పార్టీలో కీలక పాత్ర పోషించే లేళ్ళ అప్పిరెడ్డి పరామర్శ కోసం జగన్ ఎందుకు ముందుకురాలేదు.? గతంలో వల్లభనేని వంశీ మొదలుకొని, నందిగామ సురేష్, సిదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు…ఇలా అనేకమంది వైసీపీ నేతల కోసం జగన్ ‘పరామర్శ’ యాత్రలు సాగించారు, అలాగే వారి కుటుంబాలకు అండగా ఉంటామంటూ కుటుంబ సభ్యుల కోసం ‘ఓదార్పు’ యాత్రలు చేశారు.
కానీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీ గా, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండే లేళ్ళ విషయంలో జగన్ ఎందుకు పరామర్శ యాత్రకు ముందుకు రాలేకపోతున్నారు.? పార్టీ అధినేతగా వైఎస్ జగన్ లేళ్ళ అరెస్టు ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కే పరిమితం అవ్వడం వెనుక ఉన్న ఆ కారణాలేమిటి.?
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించేలా లేళ్ళ వ్యవహరించిన తీరు ప్రజా క్షేత్రంలో ఆమోదయోగ్యం కాదనే సత్యాన్ని జగన్ గ్రహించారా.? లేదా ఆ పరామర్శ యాత్ర ద్వారా వైసీపీ రాష్ట్రంలో ఎటువంటి కుల రాజకీయాలను ప్రోత్సహించే వీలు లేదని వెనక్కి తగ్గారా.?
నాడు అంబటి అరెస్టుతో కాపు సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి తద్వారా టీడీపీ, జనసేన మధ్య రాజకీయ చీలిక తేవాలని వైసీపీ భావించినట్టు మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి, అలాగే వైసీపీ కూడా అదే తరహా అడుగులు వేస్తూ వచ్చిన అవకాశాన్ని కుల రాజకీయాల దిశగా మళ్లించే ప్రయత్నాలు చేసిందనే ఆరోపణలు మోసింది.
ఇక నాడు వంశీ విషయంలో కూడా వైసీపీ ఇదే తరహా రాజకీయంతో కమ్మ సామాజికవర్గాన్ని ఆలోచింపచేసేలా ప్రకటనలు చేసింది. వల్లభనేని, చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన నేత అయినా కూడా బాబు తన సొంత సామాజికవర్గం వారి రాజకీయ ఎదుగుదలను అణిచివేసేందుకు ఇటువంటి అరెస్టులకు పాల్పడుతున్నదంటూ వాపోయింది.
అటువంటి వైసీపీ ఇప్పుడు లేళ్ళ అప్పిరెడ్డి అరెస్టు విషయంలో మాత్రం గతంలో మాదిరి రెచ్చిపోవడం లేదు, ఇతర సామాజికవర్గం వారిని రెచ్చకొట్టే ప్రయత్నం చేయడం లేదు. దీనితో పార్టీ అధినేతగా జగన్ కూడా లేళ్ళ అరెస్టు విషయాన్ని లైట్ తీసుకున్నారా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.







