హైదరాబాద్‌లో టిడిపి నిరసనలు ఓకేనా?

Lets-Metro-For-CBNహైదరాబాద్‌లో నేడు వేలాదిమంది ఐ‌టి ఉద్యోగులు, టిడిపి మద్దతుదారులు నల్లదుస్తులు ధరించి మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనలు తెలుపుతూ ఆయనకు సంఘీభావం తెలిపారు. అందరూ మెట్రోలో ఎల్బీ నగర్‌ వరకు ప్రయాణించాలని భావించినప్పటికీ, పోలీసులు వారిని అడ్డగించారు. కానీ కొందరు మెట్రో లోపలకు ప్రవేశించగానే ట్రైన్ కదలడంతో పోలీసులు వారిని ఆపలేకపోయారు. వారు మెట్రోలో నినాదాలు చేస్తుండటంతో కొంతమంది ప్రయాణికులు వారితో వాగ్వాదానికి దిగారు.

ADVERTISEMENT

మరికొందరు పోలీసులను తప్పించుకొని తర్వాత వచ్చిన మెట్రోలో ఎక్కారు. కానీ పోలీసులు వారిని బలవంతంగా కిందకు దించేశారు. ఈ సందర్భంగా వారికీ పోలీసులకు మద్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. మియాపూర్ మెట్రో స్టేషన్‌ని కాసేపు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించకపోవడంతో అందరూ నినాదాలు చేస్తూ రోడ్డుపై ముందుకు సాగిపోయారు. ఈ సందర్భంగా దారిలో కొందరు తెలంగాణవాసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. “దమ్ముంటే వెళ్ళి మీ జగన్మోహన్‌ రెడ్డిని కొర్రుకాల్చి వాతలు పెట్టండి అంతే కానీ ఇక్కడ హైదరాబాద్‌లో ఆందోళనలు చేస్తామంటే కుదరదని” వాదించారు. దాంతో మళ్ళీ అక్కడా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కానీ చంద్రబాబు నాయుడుకి మద్దతుగా వారు చేపట్టిన నిరసన ర్యాలీ విజయవంతం అయ్యింది. తద్వారా చంద్రబాబు నాయుడు విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తే సహించేదిలేదని స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్లే భావించవచ్చు. హైదరాబాద్‌ పరిధిలో శాసనసభ ఎన్నికలను ప్రభావితం చేయగలమని కూడా చాటి చెప్పిన్నట్లయింది.

కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణవాదం ఎంత బలంగా ఉండేదో, ఇప్పుడు కూడా అంతే బలంగా ఉందనే విషయం కూడా ఈరోజు మరోసారి రుజువైంది. తెలంగాణవాదం బలంగా ఉండాలనే బిఆర్ఎస్ పార్టీ కోరుకొంటోంది. టిడిపికి మద్దతుగా చేసే ఏ కార్యక్రమమైనా బిఆర్ఎస్ పార్టీ అనుకూలంగా మార్చుకొని లబ్ధి పొందేందుకు ప్రయత్నించవచ్చు. కనుక హైదరాబాద్‌లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేముందు అన్ని కోణాలలో ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది.

ADVERTISEMENT
Latest Stories