తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ పదవి చేపట్టిన తర్వాత దిల్‌రాజుకి ప్రతీరోజూ అగ్నిపరీక్ష తప్పడం లేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది సినీ ప్రముఖులు వారితో సన్నిహితంగా ఉండేవారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండాల్సి వస్తోంది.
సినీ పరిశ్రమకి ప్రభుత్వంతో అనేక పనులు, అవసరాలు ఉంటాయి కనుక ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే డాంతో సఖ్యతగా ఉండటం చాలా అవసరం. ఇదేమీ విచిత్రం కాదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటున్నందున బిఆర్ఎస్ పార్టీపై దిల్‌రాజు కత్తులు కూడా దూయాల్సి వస్తుండటమే కొత్త పరిణామం.
సిఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో సమావేశం కావడంపై కేటీఆర్ స్పందిస్తూ, “రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫ్యల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే సినీ పరిశ్రమని టార్గెట్ చేసుకొని అసెంబ్లీలో ఆవిదంగా మాట్లాడారు.
ఆ తర్వాత అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేందుకే సినీ ప్రముఖులతో సమావేశం అంటూ హడావుడి చేశారు. దానిలో వారితో సెటిల్ చేసుకున్నాక ఇక ఆ వివాదం గురించి మాట్లాడటం మానుకున్నారు,” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దిల్‌రాజు వందల కోట్లు బడ్జెట్‌తో అనేక సినిమాలు చేస్తుంటారు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరినీ గట్టిగా వ్యతిరేకించడం మంచిది కాదు. మొసళ్ళ చెరువులో చేపలు జీవించాల్సి వచ్చినప్పుడు ఒడుపుగా వాటి నుంచి తప్పించుకుంటూ జీవించాల్సిందే.
అలాగే దిల్‌రాజుతో సహా సినీమా వాళ్ళు అందరూ ‘నొప్పింపక తానొవ్వవక్క’ అన్నట్లు అవమానాలు దిగమింగుకుంటూ సర్దుకుపోతుంటారు.
వారు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసి ఉండొచ్చు. అవి మరిన్ని వందల కోట్లు కలెక్షన్స్ సాధిస్తుండవచ్చు గాక. కానీ కడవంత గుమ్మడి కాయ కత్తి పీటకు లోకువే అన్నట్లు సినీ పరిశ్రమలో ఎంతటి వారైనా రాజకీయ నాయకులకు లోకువే… అని తెలుసు కనుక అందరూ ఓర్పుగా అన్నిటినీ భరించేస్తుంటారు.
ఒకవేళ దిల్‌రాజు టిఎఫ్‌డీ ఛైర్మన్ కాకపోయి ఉంటే బహుశః కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించి ఉండేవారు కాదేమో? కానీ టిఎఫ్‌డీ ఛైర్మన్‌గా ఉన్నందునే వెంటనే స్పందించక తప్పలేదు.
బిఆర్ఎస్ పార్టీకి యువరాజు, అవకాశం వస్తే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అయిన కేటీఆర్‌ని తప్పు పడుతూ లేఖ వ్రాయాల్సి వచ్చింది. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది ఆయన పరిస్థితి.. టాలీవుడ్ పరిస్థితి.
ఈ టిఎఫ్‌డీ ఛైర్మన్ పదవి రాజకీయ నిరుద్యోగులకైతే బంగారు సింహాసనం మీద బంగారు కిరీటం ధరించిన్నట్లే. కానీ సినీ పరిశ్రమలో ఎవరికైనా ఇది ముళ్ళ కిరీటమే. ఆ నొప్పి బాధ పెట్టుకుని భరిస్తున్న దిల్‌రాజుకే బాగా తెలుసు.




