ఇంటర్నేషనల్ మూవీస్ లో నటిస్తూ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు బాలీవుడ్‌లో ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి ఆమె తల్లి మధుచోప్రా వివరించారు. లైంగిక వేధింపులకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ప్రియాంక చోప్రా దాదాపు పది పెద్ద సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయిందని తెలిపారు.
17 ఏళ్ల వయసులోనే ప్రియాంక చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిందని, అప్పటి నుంచి మూడేళ్ల క్రితం వరకు సినిమాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆమెకు తోడుగా నేనున్నానని, ఒకసారి ఓ దర్శకుడు వచ్చి తాను కథ చెబుతున్నపుడు నన్ను బయట ఉండాలని కోరాడు. దానికి తన అమ్మ వినలేని కథను తాను చేయబోయేది లేదని ప్రియాంక సమాధానమిచ్చినట్లుగా మధుచోప్రా వెల్లడించారు.
ఇలా ప్రియాంక… లైంగిక వేధింపులకు విరుద్ధంగా ఉండటం కారణంగా అసహనానికి గురైన ఓ ప్రముఖ దర్శకుడు ఆమెకు అవకాశాలు రాకుండా చేశాడని మధుచోప్రా తెలిపారు. అయితే హాలీవుడ్ లో అలా లేదని, అక్కడ అందరూ ప్రియాంకను చాలా గౌరవిస్తారని పేర్కొన్నారు.
అలాంటి వారిని పట్టించుకోకుండా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు ప్రియాంక చాలా కష్టపడిందని, నీతిమాలిన చవకబారిన కథలను ఆమె చాలా సార్లు తిరస్కరించిందని మధుచోప్రా చెప్పారు. ప్రియాంకను ఆదర్శంగా తీసుకుని యువతులందరూ సమస్యలను గట్టిగా ఎదుర్కోవాలని ఆమె కోరారు.





