మెగా హీరోలకు సంబంధించి ఇటీవల కాలంలో ‘ఫేక్ రికార్డ్స్’ అనే మాట ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి రామ్ చరణ్ తేజ్ ‘మగధీర’ సినిమాకు సంబంధించిన ఫిఫ్టీ డేస్, హండ్రెడ్ డేస్ సెంటర్స్ విషయమై కాగా, మరొకటి లేటెస్ట్ సెన్సేషన్ అల్లు అర్జున్ యొక్క “దువ్వాడ జగన్నాధమ్” సినిమా కలెక్షన్స్ గురించి! రాజమౌళి పెదవి విప్పడంతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఈ ‘ఫేక్ రికార్డ్స్’పై చర్చలు జరిగాయి.
అయితే ఈ సారి మాత్రం ఫేక్ అన్న దానికి తావు లేకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం చెర్రీ సినిమాలేవీ లేకుండా రికార్డులు ఎక్కడ నుండి ఊడిపడ్డాయి అనుకుంటున్నారా..! ఇది సిల్వర్ స్క్రీన్ కు సంబంధించిన రికార్డు కాదు, యూ ట్యూబ్ క్లిక్స్ కు సంబంధించిన రికార్డును ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ మూవీ సొంతం చేసుకోవడం విశేషం.
‘దర్శకధీరుడు’ రాజమౌళి దర్శకత్వంలో చెర్రీ హీరోగా నటించిన “మగధీర” సినిమాను ‘బాహుబలి 2’ పేరుతో హిందీలోకి డబ్ చేసి, 2016లో యూ ట్యూబ్ లో విడుదల చేయగా, తాజాగా ఈ సినిమా 100 మిలియన్ క్లిక్స్ ను అందుకుని ఓ సరికొత్త రికార్డును అందుకుంది. ఇండియన్ సినీ చరిత్రలో ఒక డబ్బింగ్ సినిమా యూ ట్యూబ్ లో 100 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకున్న తొలి మూవీగా మన జక్కన్న సినిమానే నిలిచింది.



