తనకు అత్యంత ఇష్టమైన దర్శకుడిగా సుకుమార్ ను రాజమౌళి ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటారు. ముఖ్యంగా సుక్కు పెట్టే షాట్స్ అద్భుతంగా ఉంటాయని, ఓ సాధారణ సీన్ ను కూడా తన టేకింగ్ తో సుకుమార్ బాగా ఎలివేట్ చేస్తారని వివిధ సందర్భాలలో రాజమౌళి చెప్పిన విషయాలు తెలిసిందే.
లేటెస్ట్ గా రిలీజ్ అయిన “పుష్ప”కు కూడా పరోక్షంగా సలహాలు ఇచ్చి సుక్కుకు చాలా దోహదం చేసారు జక్కన్న. హిందీ రిలీజ్ ను పూర్తిగా వదులుకున్న తర్వాత రాజమౌళి ఇచ్చిన సలహాతోనే మళ్ళీ హిందీలో ‘పుష్ప’ను రిలీజ్ చేశామని స్వయంగా సుకుమారే ఇటీవల వెల్లడించారు.
అంతలా పెనవేసుకుపోయిన వీరిద్దరి అనుబంధానికి ప్రతీకగా మరో ఉదంతం వెలుగుచూసింది. ‘రంగస్థలం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ చరణ్ – సుకుమార్ లు మరోసారి జత కట్టబోతున్న విషయం తెలిసిందే. బహుశా ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించే సినిమా ఇదే కావచ్చు.
ఈ సినిమాలో ఓపెనింగ్ షాట్ తనకు తెలుసని, కానీ దీనిని నేను చెప్పను, చెప్తే సుకుమార్ కు హార్ట్ ఎటాక్ వచ్చేస్తుందని “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి చెప్పుకొచ్చారు. రాజమౌళి అంతటి వ్యక్తినే ఫిదా చేసిందంటే, ఇక ఫ్యాన్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాలా?
దీంతో అప్పుడే సుక్కు – చెర్రీ కాంబోపై అంచనాలు పెంచేశారు జక్కన్న. అయితే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే, గతంలో మహేష్ – క్రిష్ కాంబోలో రానున్న “శివమ్” కధ గురించి కూడా రాజమౌళి ఇలాగే చెప్పుకొచ్చారు. ఈ సినిమా కధ తనకు తెలుసని, అత్యద్భుతంగా ఉంటుందని చెప్పగా, అసలు ఆ కాంబోనే ఇప్పటివరకు పట్టాలు ఎక్కలేకపోయింది.
రాజమౌళినే “శివమ్” మెప్పించారంటే, ఇక ఈ సినిమాకు తిరుగులేదనే భావనలో మహేష్ బాబు అభిమానులు సందడి చేసారు. కానీ అప్పటినుండి ఇప్పటివరకు అటు క్రిష్ గానీ, ఇటు మహేష్ గానీ “శివమ్” గురించి అసలు ప్రస్తావించలేదు. ఇపుడు రామ్ చరణ్ – సుకుమార్ కాంబో కూడా అలానే అవుతుందేమోనని సెంటిమెంట్ కు ప్రాధ్యానత ఇచ్చే ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.



