మహేష్ సెంటిమెంట్ మళ్ళీ కలిసొచ్చేనా?

Mahesh Babu And Rajamouli“ఆర్ఆర్ఆర్” సినిమా కోసం మహేష్ బాబు తన “సర్కార్ వారి పాట” సినిమాను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ మార్చగానే అందరి కంటే ముందుగా ‘సర్కార్ వారి పాట’ను దాదాపుగా మూడు నెలల పాటు వాయిదా వేసేసిన మహేష్ కు, ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు దర్శక దిగ్గజం.

‘సర్కార్ వారి పాట’ సంక్రాంతికి సరైన సినిమా అయినప్పటికీ, సమ్మర్ కి వాయిదా వేసి ఇండస్ట్రీలో మంచి వాతావరణం సృష్టించడానికి కారణమైన నా హీరో మహేష్ కు మరియు ‘సర్కార్ వారి పాట’ చిత్ర యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు’ అంటూ రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ADVERTISEMENT

అలాగే ‘ఎఫ్ 3’ సినిమాను వాయిదా వేసుకున్నందుకు గానూ నిర్మాత దిల్ రాజు గారికి మరియు ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ ను మార్చినందుకు గానూ ప్రొడ్యూసర్ చినబాబు మరియు హీరో పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తూ… అన్ని సినిమాలకు శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో ‘బాహుబలి – శ్రీమంతుడు’ సినిమాలు కూడా రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ అవడంతో, నాడు “శ్రీమంతుడు” సినిమాను మహేష్ వాయిదా వేసుకుని ‘బాహుబలి’ కోసం పూర్తి స్థాయిలో సహకరించారు. ‘బాహుబలి’ రిజల్ట్ తెలిసిందే, అలాగే వెనక్కి తగ్గిన ‘శ్రీమంతుడు’ నాన్ బాహుబలి రికార్డులను కైవసం చేసుకుంది.

ఈ సెంటిమెంట్ లెక్కల ప్రకారం అయితే ప్రస్తుత ‘ఆర్ఆర్ఆర్’ కూడా ‘ఇండస్ట్రీ హిట్’ అందుకోవాలి, అలాగే ‘సర్కార్ వారి పాట’ నాన్ ఆర్ఆర్ఆర్ హిట్ గా నిలవాలి. సెంటిమెంట్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సినీ పరిశ్రమలో ఇలాంటి సెంటిమెంట్ లకు ఏ మాత్రం కొదవ ఉండదు.

మరి మహేష్ సెంటిమెంట్ ఈ సారికి కూడా రాజమౌళికి కలిసొస్తుందా? ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ ఇండస్ట్రీ హిట్ అందుకోలేని పక్షంలో ‘సర్కార్ వారి పాట’ సంగతేటి? పెద్ద సినిమాలు రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటి లెక్కలు వస్తూనే ఉంటాయి. ఏ పుట్టలో ఏ పాముందో అన్న రీతిలో ఏ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో?!

ADVERTISEMENT
Latest Stories