అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన “బాహుబలి” సినిమా షూటింగ్ విషయంలో దర్శకుడు రాజమౌళి ఎన్ని నియమ నిబంధనలను పెట్టారో అందరికీ తెలిసిందే. షూటింగ్ పిక్స్ బయటకు రాకుండా ఉండడానికి మొబైల్స్ ను సెట్స్ లోకి తీసుకురావడానికి రాజమౌళి అనుమతి ఇవ్వలేదన్న విషయం బహిరంగమే. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా… లీక్ కావల్సినవి పక్కాగా లీక్ అయ్యాయిలేండి… అది వేరే విషయం..!
సరిగ్గా ఇదే ఫార్ములాను కొరటాల శివ తన “భరత్ అనే నేను” సినిమా కోసం అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. బుధవారం నుండి ఈ సినిమా సెట్స్ లోకి మహేష్ ఎంటర్ కాగా, జూలై మొదటి వారం వరకు ఈ సినిమా షెడ్యూల్ నిర్విరామంగా సాగనుంది. అయితే సెకండ్ షెడ్యూల్ నుండి ‘భరత్ అనే నేను’ సెట్స్ లోకి మొబైల్స్ ను అనుమతించకూడదని కొరటాల శివ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
దీనికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు గానీ… తదుపరి షెడ్యూల్స్ షూటింగ్ ఇటీవల వేసిన అసెంబ్లీ సెట్స్ లో జరగనుందని సమాచారం. దీంతో ముఖ్యమంత్రిగా మహేష్ బాబు లుక్ బయటకు లీక్ కాకూడదని కొరటాల తీసుకునే జాగ్రత్తలలో భాగంగానే ఈ నిబంధనను అమలు చేయబోతున్నారు. మరి ‘బాహుబలి’ మాదిరి కాకుండా, ‘భరత్’ అనే నేను లీక్ కాకుండా ఉంటుందా?! లెట్స్ వెయిట్ అండ్ సీ..!



