యువతరం సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, ఎస్.ఎస్.థమన్, అనూప్ రూబెన్స్, మిక్కీ జే మేయర్ల ముందు ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ వెనుకబడ్డారు. కొత్తదనం లేని మణి మ్యూజిక్ ప్రేక్షకులను సమ్మోహితులను చేయడంలో విఫలమవుతుండడంతో ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు మణిశర్మ పూర్తిగా దూరమయ్యారు. అయితే తాజాగా ఓ సినిమా ఈ నెల 22వ తేదీన తన సంగీతంతో మరోసారి అభిమానులను ఆకట్టుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మణి.
‘భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాధ’ వంటి వరుస విజయాలతో మాంచి ఊపు మీద ఉన్న నాని హీరోగా రూపుదిద్దుకుంటున్న “జెంటిల్మెన్” సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆడియో విడుదల తేదీకి ముహూర్తం ఖరారు చేసుకుంది. ఈ నెల 22వ తేదీన మణిశర్మ మ్యూజిక్ అందించిన “జెంటిల్మెన్” ఆడియో విడుదల కానుండగా, 12వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
నాని మొదటి సినిమా ‘అష్టాచెమ్మా’ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ కాంభినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు బాగానే నెలకొన్నాయి. వినూత్నమైన సినిమాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడిగా పేరుగాంచిన ఇంద్రగంటి, ఈ సారి ఎలాంటి కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నారో చూడాలి. మణిశర్మ కాంభినేషన్ లో కూడా నానికి, ఇంద్రగంటిలకు మొదటి సినిమా ఇదే కావడం విశేషం.



