ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ నుంచి స్ఫూర్తి పొందటం తప్పేమి కాదు. సరైన రీతిలో దాన్ని మలుచుకునే నేర్పు ఉండాలి. కృష్ణ పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా మీనాని త్రివిక్రమ్ అఆగా మార్చి తీస్తే జనం సూపర్ హిట్ చేసి ఇచ్చారు. ఎందుకంటే రెండింటి మధ్య ఉన్న గ్యాప్ చాలా పెద్దది. కానీ కొందరు దర్శకులు ఈ సూత్రాన్ని సరిగ్గా వంటబట్టించుకోరు.
జనం ఆదరించిన ఒక విభిన్న ప్రయత్నాన్ని ఫార్ములాగా భ్రమపడి దాన్నే ఫాలో కావాలని చూసి బోల్తా పడతారు. అలాంటిదే మను చరిత్ర. నెలల తరబడి వాయిదా పడుతూ ఎట్టకేలకు థియేటర్లకు తీసుకొచ్చారు. ఇదో మల్టీ లేయర్ స్టోరీ. మను అనే కుర్రాడు ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కొంత కాలం అయ్యాక ఆమె బ్రేకప్ చెబుతుంది. ఫలితంగా వ్యసనాలకు బానిసవుతాడు.
దీంతో ఎవరెవరినో ప్రేమించి సివరాఖరికి గుడ్ బై చెబుతుంటాడు. అన్నట్టు ఓ రౌడీ దగ్గర ఉద్యోగం కూడా వెలగబెడుతూ ఉంటాడు. సమాంతరంగా రాజకీయాలతో ముడిపడిన ఓ మేయర్ మర్డర్ కథ నడుస్తుంది. ఫైనల్ గా మనులో మార్పు తెచ్చింది ఎవరు, అతని జీవితం ఏ మలుపులు తీసుకుందనేదే అసలు పాయింట్. సరిగ్గా రాసుకుంటే నిజానికి ఎంతో కొంత స్కోప్ ఉన్న ప్లాటే ఇది.
దర్శకుడు భరత్ పెదగాని అర్జున్ రెడ్డిని ఇన్స్ పిరేషన్ గా తీసుకుని కోడి రామకృష్ణ టైపు పొలిటికల్ టచ్ ఇచ్చి దీన్ని అన్ని వర్గాలకు దగ్గర చేయాలని విశ్వప్రయత్నం చేశాడు. కేవలం మలుపులు ఉంటే సరిపోదు. బిగి సడలని కథనం ఉండాలి. శివ కందుకూరిని విజయ్ దేవరకొండలా ప్రొజెక్ట్ చేయాలనుకున్న ఆలోచన దగ్గరే తప్పు జరిగిపోయింది.
ఆ క్యారెక్టరైజేషన్ హ్యాంగోవర్ లోనే మను పాత్రని డిజైన్ చేసుకోవడంలో ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో దాని పాత్ర మరీ కృతకంగా మారిపోయి విపరీతంగా విసుగొచ్చేందుకు కారణమయ్యింది. వేగం కోరుకుంటున్న ఆడియన్స్ కి పరీక్ష పెట్టేలా నిడివిని విపరీతంగా పెట్టేయడం మను చరిత్రను ఇంకా కిందకు తీసుకెళ్లింది. పైగా ఏదో గొప్ప వ్యక్తి హిస్టరీని చెబుతున్నట్టు టైటిల్ అలా పెట్టడం సింక్ అవ్వలేదు.
రాహుల్ రామకృష్ణ టైపులో సుహాస్ తో చేయించిన ఫ్రెండ్ పాత్ర, ధనుంజయ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ ని వాడుకునే నేర్పు లేకపోవడం, హీరోయిన్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి యూత్ ని ఆకట్టుకోవచ్చనే లెక్కలో రిపీటయ్యే ప్రేమకథలు పెట్టడం అన్నీ మిస్ ఫైర్ అయ్యాయి. నాన్ సింక్ లో రౌడీ బ్యాక్ డ్రాప్ ఒకటి. ఫైనల్ గా చరిత్ర రాశారు కానీ పూర్తి కాక ముందే చెదలు పట్టేసింది.



