మెగా డీఎస్సీ-2025లో మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు నేడు విజయవాడలో భారీ ‘ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి 7,000 మందికి పైగా ఉపాధ్యాయులు తరలి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
తాము ఎంతో కష్టపడి చదివి లక్షలాదిమందితో పోటీ పది ఈ ఉద్యోగాలు సాధించుకుంటే, తమకు ఆ సంతోషం కూడా మిగలనీయకుండా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుష్ప్రచారంతో అందరూ తమని అనుమానంగా చూస్తున్నారని, ఇది తమకు చాలా అవమానకరంగా ఉందని వారన్నారు. వైసీపీ దుష్ప్రచారంతో తమ ఆత్మగౌరవం దెబ్బ తీస్తోందని, దీనిని సహించలేకనే నేడు ఈ ‘ఆత్మగౌరవ ర్యాలీ’లో పాల్గొంతున్నామని తెలిపారు.
ఉపాధ్యాయులను బలి చేయాలనుకోవడం వైసీపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. కనుక ఇకనైనా వైసీపీ తమపై ఈ దుష్ప్రచారం మానుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలసి ఉంటుందని హెచ్చరించారు.
వారి ఆవేదన, ఆగ్రహం రెండూ సహేతుకమే. ఉపాధ్యాయులకు కనీస విద్యార్హత లేదని, దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని, మంత్రుల రికమండేషన్లతో ఉద్యోగాలు సంపాదించుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ టార్గెట్ మంత్రి నారా లోకేష్ చేత రాజీనామా చేయించడం.
కానీ వైసీపీ చేస్తున్న ఇటువంటి వాదనలతో, ఉద్యోగాలలో చేరిన ఉపాధ్యాయులు పాఠశాలలో సాటి ఉపాధ్యాయులు, విద్యార్ధుల ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే ఆత్మగౌరవ ర్యాలీ చేయక తప్పలేదు.
ఒకవేళ వైసీపీకి డీఎస్సీపై అనుమానాలుంటే కోర్టులో కేసు వేసి తేల్చుకోవచ్చు. లేదా ఎలాగూ వచ్చే ఎన్నికలలో మేమే గెలిచి అధికారంలోకి వస్తామని బల్ల గుద్ది వాదిస్తోంది. కనుక అప్పుడు విచారణ జరిపించి నకిలీ ఉపాధ్యాయులందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగించి చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా?
కానీ డీఎస్సీలో అవకతవకలు-మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ పాట పాడుతూ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బ తీస్తోంది. గతంలో ఈవిధంగా చేసినందుకే ఉపాద్యాయులు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అప్పుడే ఆ విషయం మరిచి మళ్ళీ ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ఏమవుతుంది? ఈసారి ఆ 11 సీట్లు కూడా రాకుండాపోవచ్చు.
ఇప్పటికే వైసీపీ అమరావతికి వ్యతిరేకిస్తోందనే చెడ్డపేరు మూటగట్టుకట్టుకుంది. ఇప్పుడు డీఎస్సీ పేరుతో ఉపాధ్యాయులను కూడా శత్రువులుగా మార్చుకుంటామంటే ఎవరు వద్దంటారు?




