వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రుల విమర్శలు చాలా చిత్రంగా ఉంటాయి. తాజాగా అమరావతి భూముల విషయంలో… ఫైబర్ గ్రిడ్‌లో భారీగా అవినీతి జరిగిందంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన విమర్శలు చాలా చిత్రంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరం.
“రాజధానిలో అక్రమాలు జరగకుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? రాజధానిలో అక్రమాలు జరగలేదని చంద్రబాబు సీబీఐకి లేఖ రాయగలరా? దమ్ముంటే చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి. ఫైబర్ గ్రిడ్‌లో కూడా భారీ అవినీతి జరిగింది,” అని మంత్రి చెప్పుకొచ్చారు. చంద్రబాబు భయపడితే మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేస్తుందా?
అక్రమాలు జరగలేదని చంద్రబాబు సీబీఐకి లేఖ రాస్తే… అక్రమాలు జరగలేదని ప్రభుత్వం ఒప్పుకుంటుందా? చంద్రబాబు ఏం అంటున్నారు? అనేదానికి నిమిత్తం లేకుండా ప్రభుత్వం అందులో విచారణ జరిపి అవకతవకలు జరిగితే న్యాయస్థానాలలో నిరూపించి… శిక్ష పడేలా చెయ్యవచ్చు కదా?
మరోవైపు… కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సహా అన్నీ చేసేసినట్టు సీఆర్డీఏ భూకుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ లో అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించున్నారట. ఈ విషయంగా పార్లమెంట్ లో పోరాడాలని వైసీపీ ఎంపీలు తీర్మానించుకోవడం విశేషం.





