“మరి ఆయన అలా అనుకుంటున్నపుడు కిరాణా కొట్టు పెట్టుకోవచ్చుగా, ఎందుకు సినిమాలు చేయడం” హీరో నాని కామెంట్స్ పై వైసీపీ ఎమ్మెల్యే అయిన రోజా చేసిన కామెంట్స్. ఇంకా ఏ హీరోపై ఎలాంటి కామెంట్స్ చేసారో, ఏమేమి చెప్పారో ఆమె పలుకులలోనే…
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే అది ఒక మనిషి కోసం చేసేది కాదు, ఇంతమందికి ఉపయోగపడే విధంగా ఆయన చేస్తే, తన ఒక్క సినిమా గురించి నాని గారు ఇలా ఆలోచనలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే మేమందరం కూడా నాని సినిమాలు చూస్తాం, చాలా చక్కటి సినిమాలతో పక్కింటి అబ్బాయిలా ఉంటారని. కానీ ఆయన మాట్లాడడంతో నేను కూడా షాక్ అయ్యా.
ఖచ్చితంగా ఇలా మాట్లాడడం వలన రెచ్చగొట్టే విధానంతో ఇంకా నష్టపోయే పరిస్థితి ఉంటుంది గానీ, ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో చక్కగా నిర్ణయం తీసుకుంటే, అటు పెద్ద సినిమాలకు, ఇటు చిన్న సినిమాలకు ఇద్దరికీ న్యాయం జరుగుతుంది. ఇండస్ట్రీలో ఐక్యత గురించి వాళ్లనే అడగాలి, ఎందుకంటే నేను ఇప్పుడు సినిమాలు చేయడం లేదు.
అయితే కొంతమంది పొలిటికల్ గా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టి వాళ్ళ మీద నిందలు వేసి, వాళ్ళు ఇండస్ట్రీకి నష్టం చేస్తున్నారనేది స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే వాళ్ళ యొక్క నోటి దురద వలన మొన్న మా అసోసియేషన్ ఎన్నికలు ఏ విధంగా జనరల్ ఎలక్షన్స్ తలపించాయో, ఇప్పుడు కూడా అలాంటి నోటి దురద వల్లే ఇంతవరకు తెచ్చుకున్నారని నేను అనుకుంటున్నాను.
ఇన్ని రోజులు లేని దాన్ని ఈ రోజు అది ఒక పెద్ద ఇష్యూ చేస్తున్నారంటే, ఒక పొలిటికల్ పార్టీ పెట్టి సినిమాలు చేస్తున్న వ్యక్తి వల్లే అనేది అందరికీ తెలుసు. నిజంగా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు నష్టపోయేలా ఉంటే వారంతా కూర్చుని ప్రభుత్వంతో మాట్లాడాలి గానీ, సంబంధం లేకుండా ఎవరు ఏది పడితే అది మాట్లాడితే దాని మీద నిర్ణయం తీసుకోవడానికి కూడా ముందుకు రారు, మనకెందుకులే గొడవ అనుకుంటారు.
అలా కాకుండా నిజంగా ఇద్దరికీ మంచి జరగాలి అనుకుంటే, ఒక డిగ్నిఫైడ్ గా, బాలన్స్ డ్ మంచి వ్యక్తులు ఆ కమిటీలో ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరైతే మాట్లాడుతున్నారో వారి నోటి దగ్గర నుండి ప్రొడ్యూసర్ మైక్ కూడా లాక్కోవడం వీడియోస్ లో చూసారు. కాబట్టి అలాంటివి కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇపుడు వేసిన కమిటీ ద్వారా 100 శాతం ఓ కొలిక్కి వస్తుంది.
ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారి మనసులో కూడా ఏమీ లేదు. ఆయన వైట్ పేపర్ లాగా ఫెయిర్ గా ఉంటారు. ఏం జరిగినా కూడా అందరికీ మంచి జరగాలనుకుంటారు. అందరికీ మంచి జరగాలంటే వాళ్ళు డిస్కషన్స్ కు వచ్చేటపుడు ఒక పాజిటివ్ మోడ్ తో రావాలి గానీ, గొడవ పెట్టుకోవాలన్న మోడ్ తో లేకుండా ఉంటే బాగుంటుంది.
జగన్ గారు ఏది చేసినా పేద వాళ్లకు, చిన్న సినిమాలకు నష్టం జరగకుండా పెద్ద సినిమాలు కూడా కో ఆర్డినేట్ చేసుకుని కూడా ఈ టికెట్ వ్యవహారం ముందుకు వెళ్ళుంటే ఇంత గొడవ అయ్యేది కాదు. వాళ్ళు ఎంత సేపు వాళ్ళ పెద్ద సినిమాల గురించే ఆలోచిస్తున్నారు గానీ, చిన్న నిర్మాతల గురించి, సినిమాలకు వచ్చే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల గురించి ఆలోచించకపోవడం వల్లే ఈ వివాదానికి తెరలేచింది.
ఇపుడు కమిటీ వేశారు, ఆ కమిటీ పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు నష్టం లేకుండా ఓ మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను – ఇదండీ ఒకప్పుడు తెలుగు తెరపై టాప్ హీరోయిన్ గా వెలిగిపోయి, నేడు వైసీపీ శాసనసభ్యురాలిగా కొనసాగుతోన్న శ్రీమతి రోజా గారు సినిమా టికెట్ ధరలపై స్పందించిన విధానం. పవన్ కళ్యాణ్ మరియు నానిలను టార్గెట్ చేసుకుని రోజా గారు అన్న “నోటి దురద వలనే ఇదంతా” అన్న వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా?



